కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా: కేటీఆర్

కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా: కేటీఆర్

కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా అనేది తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.  రైతులకు ఫ్రీ కరెంటు ఎందుకియ్యాలని కాంగ్రెస్ నేతుల మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని... కాంగ్రెస్ నేతల తీరుతో రైతులు ఆగమవుతున్నారని విమర్శించారు.  రైతులపై కాంగ్రెస్ ఎందుకింత కక్ష గట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పాలనలో కోతలు లేని విద్యుత్ సరఫరా ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

 2023, నవంబర్ 11వ తేదీ శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బావి వద్ద నిద్రపోయిన రోజులు రైతులు గుర్తు చేసుకోవాలన్నారు.  కాంగ్రెస్ అంటేనే కాలిపోయే మోటార్లు..మీటర్లు అని... కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రైతులకు క్రాఫ్ హాటిడే ఉండేదని విమర్శించారు.70 లక్షల మంది రైతులను రేవంత్ రెడ్డి బిచ్చగాళ్లని అన్నారని... కరెంటుపై రేవంత్ రెడ్డి బరితెగింపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. రేవంత్ మరోసారి తన నైజాం బయటపెట్టారని చెప్పారు.

 మోటార్లకు మీటర్లు పెట్టమని మెడపై మోదీ కత్తి పెట్టారని... మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30వేల కోట్లు వదులుకున్నామని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని... 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిస్తున్నామని.. మన పంటలను చూసి దేశమే ఆశ్చర్య పోతోందన్నారు. దేశంలో  రైతుకు జీవిత బీమా ఇచ్చే ప్రభుత్వాలు ఉన్నాయా? అని అన్నారు.  రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ చెబుతోందని... కుసంస్కార కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాలని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ ను తరమికొట్టండని కేటీఆర్ అన్నారు.