అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు.. సీఎం రమేశ్ కామెంట్లపై కేటీఆర్ స్పందన

అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు.. సీఎం రమేశ్ కామెంట్లపై కేటీఆర్ స్పందన
  • అందుకే బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ విలీనమనేపనికిమాలిన అంశం ఎత్తుకున్నరు 
  • సీఎం రమేశ్​ కామెంట్లపై కేటీఆర్ స్పందన
  • తెలంగాణలోనే దేశంలో ఎక్కడా లేని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయాలు 
  • హెచ్‌‌‌‌‌‌‌‌సీయూలో రూ.10 వేల కోట్ల కుంభకోణం 
  • ఫ్యూచర్​ సిటీ రోడ్డంటూ రూ.1,660 కోట్ల స్కామ్​
  • ఈ రెండింటిపై సీఎం రమేశ్, ముఖ్యమంత్రి రేవంత్​ కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధమని సవాల్​

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం నడుస్తున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కాం గ్రెస్, బీజేపీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీలో బీఆర్ఎస్​ విలీనం అనే డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం రమేశ్​, ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డి కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్​ కాంట్రాక్టు ఇచ్చిందని ఆరోపించారు. అందుకు ప్రతిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్​కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టును కట్టబెట్టిందని అన్నారు.

ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చి బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ను విలీనం చేస్తానంటూ కేటీఆర్​ చెప్పారన్న సీఎం రమేశ్​ కామెంట్లపై.. శనివారం ఎక్స్‌‌‌‌లో కేటీఆర్​ రిప్లై ఇచ్చారు. రేవంత్‌‌‌‌రెడ్డి, సీఎం రమేశ్ బాగోతాన్ని తాను బయటపెట్టడంతో.. ఆ ఇద్దరూ కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారని అన్నారు. తాను ఆనాడు చెప్పింది.. ఈనాడు రుజువు అయిం దని, వారి దొంగతనం బయటపడడంతో అటెన్షన్​ డైవర్షన్​ కోసం పనికిరాని కథలు చెబుతున్నారని విమర్శించారు.  

లేని ఫ్యూచర్​ సిటీకి రోడ్డంట
హెచ్‌‌‌‌సీయూ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని కేటీఆర్​ ఆరోపించారు. ‘లేని ఫ్యూచర్​ సిటీకి రోడ్డంట.. దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్టంట’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను చెప్పింది నిజమని తేలింది. దీంతో అటెన్షన్​ డైవర్షన్​ కోసం కట్టుకథలు చెబుతున్నారు. రూల్స్‌‌‌‌ను బ్రేక్​ చేయడం.. కాంట్రాక్టును అనుకున్న వాళ్లకు అడ్డంగా కట్టబెట్టడం నీ (సీఎం రమేశ్​) దోస్తు రేవంత్​ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్​ గిఫ్ట్​.. రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్​ అని తేలిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నరు.

తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ.. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతిసారీ.. కాంగ్రెస్​, బీజేపీ  ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్‌‌‌‌ఫ్యూజ్​ చేయాలని చూస్తున్నాయి. హెచ్‌‌‌‌సీయూ భూముల రూ.10 వేల కోట్ల కుంభకోణం, ఫ్యూచర్​ సిటీలో రూ.1,660 కోట్ల రోడ్​ కాంట్రాక్ట్​ కుంభకోణాలపై చర్చకు నేను సిద్ధం. సీఎం రమేశ్​, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే ఆ రెండు అంశాలపై చర్చిద్దాం’’ అని పేర్కొన్నారు.