కేటీఆర్, రేవంత్ ట్వీట్ హీట్

కేటీఆర్, రేవంత్ ట్వీట్ హీట్
  • శశిథరూర్​ను రేవంత్ గాడిద అన్నడు
  • ఆడియోను ట్వీట్ చేసిన కేటీఆర్
  • అది ఫేక్ అంటూ రెస్పాండైన రేవంత్

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి ట్వీట్లు గురువారం పొలిటికల్ హీట్ పుట్టించాయి. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ను రేవంత్ గాడిద అన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియోను ట్వీట్ చేశారు. ‘‘ఇలాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుంది. రేవంత్ లాంటి నీచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు ఉంచాల్సిన అవసరముంది. ఈ ఆడియోను ఒక మీడియా మిత్రుడు నాకు పంపారు. దీన్ని ఫోరెన్సిక్ కు పంపితే ఓటుకు నోటు కేసులో రికార్డయిన రేవంత్ వాయిస్ తో కచ్చితంగా మ్యాచవుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్​గాంధీ స్పందిస్తారా?’’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. థరూర్​పై తాను చేసినట్టు వస్తున్న వార్తలు ఫేక్ అని రేవంత్ స్పందించారు. ఇలాంటి వాటిని అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్ తప్పించుకోలేదంటూ ట్వీట్ చేశారు. ఆరేళ్ల పాపపై ఆత్యాచారం, హత్య ఘటనలో రాష్ర్టానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని సమస్యను పక్కదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్​పై శశిథరూర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమోనంటూ ట్వీట్ చేశారు. రేవంత్​తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్​ తివారీ అన్నారు. థరూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడని, అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అని అన్నారు. చిన్నారి రేప్, హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ ఇలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా విమర్శించారు.