అమరరాజా వెళ్లిపోతే మన రాష్ట్రానికి నష్టం : కేటీఆర్​

అమరరాజా వెళ్లిపోతే మన రాష్ట్రానికి నష్టం : కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ అమరరాజా సంస్థ చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయని, ఒకవేళ అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే చాలా సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. 

కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ రాష్ట్రం నుంచి గుజరాత్‌‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ సంస్థ తన ప్లాంట్‌‌ను చెన్నైకి తరలించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతే రాష్ట్ర బ్రాండ్‌‌కు నష్టం జరుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మంచిది కాదని సూచించారు. ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 నర్సయ్యను తీసుకురండి..

పాస్‌‌పోర్ట్ పోగొట్టుకుని బహ్రెయిన్ జైలులో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్యను రాష్ట్రానికి తీసుకురావాలని విదేశాంగ శాఖ, రాష్ట్ర సర్కారును కేటీఆర్ కోరారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌‌‌‌కు లేఖ రాశారు. 1996లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య.. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నాడని, ఈ క్రమంలో 2001లో ఇండియన్ ఎంబసీ అతని పాస్‌‌పోర్టును రెన్యువల్ చేసిందన్నారు. 

ఇప్పుడు ఆ పాస్‌‌పోర్ట్ పోవడం, వర్క్ పర్మిట్ ముగియడంతో అక్రమంగా దేశంలో ఉంటున్నాడంటూ బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసిందన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పాస్‌‌పోర్ట్ ఇప్పించి ఆయన్ను ఇండియాకు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా బహ్రెయిన్‌‌లోని బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు.