రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఈసీకి లేఖ రాయాలి: కేటీఆర్

రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఈసీకి లేఖ రాయాలి: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఇంత సంక్షోభంలో ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వ పోయిన నాలుగు నెలల్లోనే ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుందని అనుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో  రైతు దీక్షలో  పాల్గొని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్న పోతుతో సమానమని,  రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ సాకు చెబుతున్నారని విమర్శించారు. 

నిజంగా రైతులపై చిత్త శుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాయాలని, అందుకు మేము కూడా సహకరిస్తామని ఆయన అన్నారు. 14శాతం ఎక్కువ నమోదైందని, ఈ కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేటీఆర్ ఆరోపించారు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే అని చెప్పారు. మేడిగడ్డ  నుండి రోజు రెండువందల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని.. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితె రిపేర్ చేయకుండా కేసీఆర్‌ని  బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మత్తులు చేస్తే తెలంగాణలో కరువే ఉండదని అన్నారు. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్ పై కాంగ్రెస్ పార్టీని నిలదిద్దాం.. రైతుల హక్కుల తరుపున కొట్లడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిందని.. ప్రజలకు మొండి చేయి  చూపించిన ఆ పార్టీకి మళ్లీ ఓట్లు పడతాయని బ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఓ గుంపు మేస్త్రీ, ప్రధాన మంత్రి తాపీ మేస్త్రీ అని కౌంటర్ వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్న కేసీఆర్ ఎర్రటి ఎండలో పంటలు పరిశీలిస్తూ ప్రజల్లో తురుగుతుంటే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఐపీఎల్ మ్యాచులు చూస్తున్నాడని కేటీఈర్ విమర్శించారు.