కోహ్లీ లెక్కనే కేసీఆర్​సెంచరీ కొడ్తడు : కేటీఆర్

కోహ్లీ లెక్కనే కేసీఆర్​సెంచరీ కొడ్తడు : కేటీఆర్
  • కోహ్లీ లెక్కనే కేసీఆర్​సెంచరీ కొడ్తడు
  • మూడోసారి ముఖ్యమంత్రి అయితడు: కేటీఆర్
  • బీఆర్ఎస్​లోకి గద్వాల కాంగ్రెస్​నేత కురవ విజయ్​కుమార్

హైదరాబాద్, వెలుగు :  విరాట్ ​కోహ్లీ లెక్కనే కేసీఆర్​అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ​అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం14 అసెంబ్లీ స్థానాలను గెల్వాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ నేత కురవ విజయ్​కుమార్, పాలకుర్తి, ముథోల్​కు చెందిన ముఖ్య నేతలు తిరుపతి రెడ్డి, కిరణ్​ వాగ్మోరే తదితరులు మంగళవారం బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు పాలమూరు అంటేనే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్​నగర్ ​అంటే ఇరిగేషన్​గా మారింది.14.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. పాలమూరు – రంగారెడ్డి పూర్తయితే ఇంకో 12 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కేసీఆర్​ను కొట్టడానికి ఢిల్లీ నుంచి ఇంత మంది రావాలా’’ అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ​అగ్ర నేతలు,15 రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు క్యూ కట్టారని, వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసీఆర్ ​సింహం లాంటోడని.. సింగిల్​గానే వస్తారని చెప్పారు. ఓటుకు నోటుకు కేసులో దొరికిన రేవంత్​ రెడ్డి పీసీసీ చీఫ్ అయి సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. రేపు పొరపాటున రేవంత్​ సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేయడం పక్కా అని విమర్శించారు. రూ.400లకే గ్యాస్​ సిలిండర్ ​ఇస్తామని, రేషన్​కార్డులున్నోళ్లకు సన్న బియ్యం, కేసీఆర్ బీమా సహా మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి, ​నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, చిరుమిల్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్​ యాదవ్ పాల్గొన్నారు.

కేటీఆర్​తో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భేటీ

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో కేటీఆర్​ను కలిశారు. అశ్వరావుపేట కాంగ్రెస్​ టికెట్​ ఆశించినా తనకు ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటేశ్వర్లు.. కేటీఆర్​ను కలిసి బీఆర్ఎస్​లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థుల గెలుపునకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఒకటి, రెండ్రోజుల్లో ఆయన తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్​లో చేరనున్నారు.

కాంగ్రెస్ ​పాపాలకు ప్రజలే శిక్షవేస్తారు..

చిత్రగుప్తుడు మనుషుల పాపాల చిట్టా రాసినట్టు కాంగ్రెస్ ​పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తుందని కేటీఆర్​అన్నారు. బీఆర్ఎస్​ సోషల్ ​మీడియా విభాగం రూపొందించిన ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’’, ‘‘స్కాంగ్రెస్” పుస్తకాలను ఆయన తెలంగాణ భవన్​లో ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్​చేసిన అన్యాయాలను, ఆ పార్టీ చేసిన కుంభకోణాలను ఈ పుస్తకాల్లో సవివరంగా చెప్పారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్​ పార్టీ దేశాన్ని పూర్తిగా గాలికొదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. ఆ పాపాల చిట్టాను దేశ, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.