ఓటు హక్కు కోసం యుద్ధం చేస్తున్నం..సర్ తో బీజేపీ ఓట్లు తొలగిస్తున్నది : కేటీఆర్

ఓటు హక్కు కోసం యుద్ధం చేస్తున్నం..సర్ తో బీజేపీ ఓట్లు తొలగిస్తున్నది : కేటీఆర్
  • ముస్లింల, క్రిస్టియన్ల ఓట్లను తొలగించేందుకు కుట్రలు
  • అర్హులైన ఒక్కరి ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలి
  • సనత్​నగర్ నియోజకవర్గ జనరల్​బాడీ మీటింగ్​లో కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: ప్రజలు ఓటు హక్కు కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరి ఓటు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా బీజేపీ ఓట్లను తొలగిస్తున్నదని విమర్శించారు. బీజేపీ వాళ్లకు పిచ్చి పిచ్చి ఆలోచనలుంటాయని, ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్లకు ఓటు వేయరని భావించి వారి ఓట్లను తీసేస్తున్నారని ఆరోపించారు.

శనివారం తెలంగాణభవన్​లో సనత్​నగర్​ నియోజకవర్గ పార్టీ జనరల్ బాడీ మీటింగ్​ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సర్ తో బీహార్, బెంగాల్​లలో గడబిడ అయిందని, లక్షలాది ఓట్లు పోయాయని అన్నారు. అక్కడి ఎన్నికల ఫలితాలపై చాలా మందికి అనుమానాలున్నాయని తెలిపారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు జరపాల్సిందిగా తాను ఎన్నికల సంఘాన్ని కోరినట్టు పేర్కొన్నారు. 

జాగ్రత్తగా ఉండాలి..

సర్ విషయంలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్​ సూచించారు. సర్​లో లోపాలుంటే ఫైట్ చేద్దామని, ఒక్క ఓటు కూడా పోకుండా బీఆర్ఎస్ క్యాడర్ జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. అర్హుల ఓట్లు పోకుండా చూడాలని, కొత్తవారి పేర్లను నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన కాంగ్రెస్ పోవడం ఖాయమన్నారు. రేవంత్ పోవాలె.. కేసీఆర్​ రావాలె అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

గ్రౌండ్​లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, సర్వేలో మంచిగున్నోళ్లకే టికెట్లు దక్కుతాయని, సిఫార్సులూ చెల్లవని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్​మాట్లాడుతూ.. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. అందరినీ మోసం చేసిందని ఆరోపించారు. మెంబర్​షిప్ డ్రైవ్ పూర్తికాగానే కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.