
కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిన మందు లాంటిదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని వరంగల్ సభలో చెప్పిన రాహుల్ గాంధీ.. గత 50 ఏళ్లు ప్రజలు చాన్సులు ఇస్తే ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. గత ఐదారు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని ఎన్నో పనులను.. కేవలం ఏడెనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. శనివారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘దేశంలో ఎక్కడా కేసీఆర్ మార్కు పాలన లేదు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని చాలా పార్టీలు దశాబ్దాల పాటు చెప్పాయి. కానీ చేయలేదు. కేసీఆర్ .. దాన్ని నిజం చేసి చూపించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ దేశాన్ని బీజేపీ రావణ కాష్టంలా మార్చేసింది. తెల్లారి లేస్తే హిందూముస్లిం మాటలు తప్ప.. ఆ పార్టీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియదు. ప్రతీ జన్ ధన్ ఖాతాలో ధనాధన్ గా రూ.15 లక్షలు వేస్తామని మోడీ చెప్పిన మాటలు ఏమయ్యాయి ?’’ అని బీజేపీపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ జంక్షన్ గా కొల్లాపూర్ మారుతుందని ఆకాంక్షించారు. రూ.170 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు.