సంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ఉద్దేశం

సంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ఉద్దేశం

దళితబంధు పథకాన్ని పుట్నాలు, బటానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అర్థవంతంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని, అందుకే దళితబంధు స్కీమ్ ను తీసుకొచ్చారని చెప్పారు. సంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ప్రధాన ఉద్దేశమన్నారు. ఇది తెలియక కొంతమంది విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తోందని కేటీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆశిస్తున్న వారికి అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని లక్డీకాపూల్లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) కార్యాలయంలో బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ,మోడల్ కెరీర్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. 

తెలంగాణ ప్రభుత్వం గత 8 ఏళ్లలో తీసుకున్న విధాన నిర్ణయాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మారాయని ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ మిలింద్ కాంబ్లే ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తుచేశారు. దళితుల్లో ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డిక్కీ ముందుకు రావడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట నుంచి 30 మంది కలిసి సమష్టిగా రూ.3 కోట్లతో ఫ్యాబ్రికేషన్ యూనిట్, సోడా మేకింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తామని ఇటీవల ముందుకొచ్చారని కేటీఆర్ చెప్పారు. ఆ రెండు యూనిట్ల ఏర్పాటుకు భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

దశాబ్దాల క్రితమే కేసీఆర్ విప్లవాత్మక పథకాలు

1988-89లోనే దళితులపై అధ్యయనం చేసేందుకు ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమాన్ని ఆనాడు ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ నిర్వహించారని తెలిపారు. సిద్ధిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి దళిత వర్గానికి చెందిన దానయ్యకు అప్పట్లో అవకాశం కల్పించింది కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘1985లోనే సిద్ధిపేటకు హరితహారం కార్యక్రమాన్ని నాడు ఎమ్మెల్యే హోదాలో సీఎం కేసీఆర్ నిర్వహించారు.అప్పట్లో ఒకే రోజు పదివేల మొక్కలు నాటించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్నే తెలంగాణకు హరితహారంగా తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్. 1996 -1997లోనే కేసీఆర్ 65 కిలోమీటర్ల దూరంలోని లోయర్ మానేరు డ్యామ్ నుంచి సిద్ధిపేటకు నీళ్లను తీసుకొచ్చారు. సిద్ధిపేటలోని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి నీటిని అందించి.. ‘మంచినీళ్ల పండుగ’ అనే కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్నే ‘మిషన్ భగీరథ’ పేరుతో తీసుకొచ్చారు’’ అని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, డిక్కీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్, డిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.