
రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశంలో నే అతి పెద్ద కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్స్ పార్క్‌లో పలు అభివృద్ది పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేతన్నకు జీవనోపాధి కలిగించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామన్న కేటీఆర్..ఈ క్రమంలోనే 50 శాతం సబ్సీడీ ఇస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం నేతన్నల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని.. రూ. 14.50 కోట్లతో టెక్స్ టైల్ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తుందని.. కరోనా నేపథ్యంలో కార్మికులు వెళ్లి పోతుంటే పరిశ్రమలకు ఇబ్బందులు పడతాయని చెప్పారు. లాభాలు ఆర్జిస్తున్నయజమానులు కార్మికుల శ్రేయస్సు కూడా చూడాలన్నారు. ఈ ప్రాంతం పారిశుధ్య చర్యల బాధ్యత యజమానులదేనని, యజమానులు కార్మికులతో ఒప్పందం చేసుకున్న విదంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పరంగా చేయుతను అందిస్తామని చెప్పిన ఆయన.. కేంద్రం సాయం కోరుతూ స్మృతి ఇరానీకి లేఖ రాయడం జరిగిందన్నారు. కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని..కార్మికులను గౌరవంగా చూసుకోవాలన్నారు. సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.