మీ సపోర్టు కావాలి

మీ సపోర్టు కావాలి
  • పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వండి
  • కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ వినతి

న్యూఢిల్లీ, వెలుగు : పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతంగా ఉన్నదని, పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్​ విజ్ఞప్తిచేశారు. ఐటీ రంగ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తన బాధ్యతను నిర్వర్తించిందని, మరింత అభివృద్ధి జరగాలంటే కేంద్రం సపోర్టు కూడా అవసరమన్నారు. అఖిలభారత స్థాయిలో చేపట్టే ఐటీ పరమైన ఏ కార్యక్రమాలకైనా, అంతర్జాతీయ సెమినార్లు, పెట్టుబడులను ఆకర్శించే సదస్సులకైనా హైదరాబాద్​ను ఎంపిక చేయాలని కేంద్ర ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్‌‌‌‌షిప్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి  రాజీవ్​ చంద్రశేఖర్​కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కేటీఆర్​ కలిశారు. 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫ్యాబ్ పాలసీని స్వీకరించేందుకు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​కు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని ఆయన వివరించారు. దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి  తెలంగాణ ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుందని చెప్పారు. ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను కేంద్ర మంత్రికి కేటీఆర్​ తెలిపారు.  ఢిల్లీ బయట తలపెట్టే ఏ పెద్ద ప్రాజెక్టు, కార్యక్రమానికైనా హైదరాబాద్​పేరును ఆలోచించవచ్చని, ఫ్యాబ్​, ఈజ్​ ఆఫ్​ డూయింగ్ బిజినెస్​, మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రాన్ని అలా తీర్చిదిద్దామని ఆయన అన్నారు. వచ్చే పదేండ్లలో  లక్షల కోట్లు వెచ్చించి ఎలక్ట్రానిక్​, ఐటీ రంగాలను కేంద్రం విస్తరించే యోచనతో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

మర్యాదపూర్వకంగా భేటీ అయ్యా: కేటీఆర్​

కేంద్ర మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు సమావేశం తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, స్కిల్లింగ్, ఇతర అంశాలను అభివృద్ధి చేయడంలో ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యవస్థను రూపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించినట్లు తెలిపారు. అనంతరం ఓ  పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు కేటీఆర్​ ఆగ్రా వెళ్లినట్లు తెలిసింది.