అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్త

అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్త
  • రాష్ట్రం రూపాయిస్తే.. కేంద్రం తిరిగిచ్చేది ఆఠాణే
  • నిజమైతే బండి సంజయ్​ రాజీనామా చేస్తరా?: కేటీఆర్
  • మన పైసలు దిక్కుమాలిన రాష్ట్రాలకు మళ్లిస్తున్నరు​
  • రేవంత్​రెడ్డి అడ్డం పొడుగు మాట్లాడుతున్నడు
  • గట్టు ఎత్తిపోతల చేపడతామని వెల్లడి
  • గద్వాల జిల్లాలో రూ. 104 కోట్ల పనులకు శంకుస్థాపన

గద్వాల / అలంపూర్​: ‘సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదని బండి సంజయ్ అంటున్నారు. గత ఏడేండ్లలో కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్ల పన్నులు కడితే రాష్ట్రానికి 1.42 లక్షల కోట్లే తిరిగిచ్చారు. కేంద్రానికి పన్నుల రూపంలో మనం రూపాయి చెల్లిస్తే కేవలం ఆఠాణానే వెనక్కి వస్తోంది. ఈ మాటలు అబద్ధమైతే నేను రాజీనామా చేస్త. నిజమైతే నువ్వు రాజీనామా చేస్తావా?’ అని మంత్రి కేటీఆర్ సవాల్​విసిరారు. రాష్ట్ర ప్రజలు చెమట, రక్తంతో కట్టిన పన్నులు ఇతర దిక్కుమాలిన రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఫైర్ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి రూ.104 కోట్ల అభివృద్ధి పనులకు మంగళవారం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత గద్వాల మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర చేస్తూ సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అన్ని పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటోందని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలవట్లేదో చెప్పాలని నిలదీశారు. 
ఏడేళ్లలో 13 మెడికల్​కాలేజీలు తెచ్చినం
ఇంకో దివాలా తీసిన పార్టీకి ప్రెసిడెంట్​అయిన రేవంత్ రెడ్డి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎంను తిడితే పెద్ద లీడర్లు కాలేరన్నారు. 65 ఏళ్లు పాలించి అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినవాళ్లు ఇప్పుడు తమను విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 65 ఏళ్లలో 4 మెడికల్​కాలేజీలు పెడ్తే గత ఏడేళ్లలోనే కొత్తగా13 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. గద్వాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే కాలంలో ఇక్కడ కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి తీరతామని అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని వెల్లడించారు. అలంపూర్ పట్టణంలో ఆధునిక హంగులతో ఆస్పత్రిని మెరుగు పరుస్తామని హామీ 
ఇచ్చారు. 
వాల్మీకిలపై పార్లమెంట్ లో మాట్లాడ్తం
సభలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నినాదాలు మిన్నంటాయి. దీంతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. దీనిపై పార్లమెంటులో మాట్లాడుతామని చెప్పారు. ఇక్కడ ఎవరైనా బీజేపీ లీడర్లుంటే దీనిపై ప్రధాని మోడీని ఒప్పించాలన్నారు. వేదికపై ఐదుగురు మంత్రులున్నా కేటీఆర్ మాత్రమే మాట్లాడి సభను ముగించారు. ఎడ్యుకేషన్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి, ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించలేదు. కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఎంపీ రాములు, ఇతర ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు 
మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే సుమారు 300 మంది ప్రతిపక్ష నాయకులు, స్టూడెంట్లు, ప్రజా, యూనియన్ సంఘాల లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయినా మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. 99వ ప్యాకేజీ దగ్గర కాలువ పూర్తి చేయాలంటూ పార్సెళ్ల స్టేజీ దగ్గర రైతులు కేటీఆర్ కాన్వాయ్​ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి గద్వాలకు చేరుకున్నాక కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర బీజేపీ, బీజేవైఎం లీడర్లు కాన్వాయ్​ను అడ్డుకొని నిరసన తెలిపారు. అక్కడి నుంచి పీజీ కళాశాలకు వెళ్తుండగా సుంకులమ్మ వైన్స్ దగ్గర కృష్ణవేణి చౌరస్తాలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు కాన్వాయ్​ను అడ్డుకున్నారు. వారిని పోలీసులు పక్కకు నెట్టేశారు.

అలంపూర్ లో 100 బెడ్స్ తో హాస్పిటల్ కడతామని నాడు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కొన్ని నెలలుగా అలంపూర్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు ముందస్తుగా అలంపూర్ పట్టణంలోని ప్రతిపక్ష, వామపక్ష నేతల ఇండ్లకు అర్ధరాత్రి వెళ్లి అరెస్టు చేశారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు సుమారు వంద మందికి పైగా అరెస్టు చేసినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఉదయం అలంపూర్ పట్టణంలో మహిళలు రోడ్డెక్కారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలంపూర్ బంద్ కు పిలుపునిచ్చారు. అలంపూర్ లోకి రాకపోకలను అడ్డకునేందుకు ముళ్లకంపలను రోడ్డుకు అడ్డంగా వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రుళ్లు అరెస్టులు చేయాల్సిన ఆవసరం ఏమొచ్చిందని మహిళలు మండిపడ్డారు. ఇండ్లలో పడుకున్నవారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.