మీరు మనుషులా.. పశువులా?: పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

మీరు మనుషులా.. పశువులా?: పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఏం తప్పు చేసిందని గెల్లు భార్యపై అటెంప్ట్​ మర్డర్​ కేసు పెట్టిన్రు
  • మూడేండ్లలో అధికారంలోకి వస్తం.. అధికారుల లెక్క తేలుస్తం
  • కలెక్టర్​ అయినా.. వాని అయ్య అయినా పేర్లు రాసిపెట్టుకుంటమని వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: వచ్చే మూడేండ్లలో బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చి కేసీఆర్​ మళ్లీ సీఎం అవుతారని.. పోలీస్​ అధికారులు, ఐఏఎస్‌‌‌‌ల లెక్క తేలుస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పినట్టు విని బీఆర్ఎస్​ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాళ్లందరి పేర్లనూ బుక్కుల్లో రాసి పెట్టుకుంటామన్నారు. బీఆర్ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ భార్యపై అటెంప్ట్​ మర్డర్​ కేసు పెట్టారని.. ఆ పోలీసులు మనుషులా, పశువులా అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం తెలంగాణ భవన్​లో తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బీఆర్ఎస్వీలో విలీనం చేసిన సందర్భంగా కేటీఆర్​ మాట్లాడారు. ‘‘నిన్నగాక మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్​ దగ్గరకు పోయినం. వాడెవడో గిట్లనే థంబ్​నెయిల్స్​.. థుంబ్​నెయిల్స్​ అని ఇష్టమొచ్చినట్లు పెడితే.. మనోడికి కడుపు మసిలి ఓ పది మందిని తీసుకొని పొయ్యి చిన్నగ నిరసన కార్యక్రమం జేసిండు. దీనికే ఆయనపై అంటెప్ట్​ మర్డర్​ కేసు పెట్టిన్రు. ఇండ్లేముందని కోర్టు రిలీఫ్​ ఇచ్చింది. 

కాకపోతే శ్రీనివాస్​ భార్య మీద కూడా అటెంప్ట్​ మర్డర్​ కేసు పెట్టిన్రు. ఆమె బయటకచ్చిందా? నిరసనల పాల్గొన్నదా అన్నది ఆమెకే తెల్వదు. శ్రీనివాస్‌ను అరెస్ట్​ చేసేతందుకు ఇంటికి పోయిన పోలీసులకు ఫోన్​ ఇయ్యనందుకు ఆమెపై ఈ కేసు పెట్టిన్రట.  ఏ సంబంధంలేని ఆ అమ్మాయి మీద  కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా.. మీరు మనుషులా? పశువులా? బుద్ధి, జ్ఞానం ఉండి చేస్తున్నరా? లేకపోతే ఉద్యోగమనేది గడ్డి తిని చేస్తున్నరా అని అడుగుతున్నా? మూడేండల్లో వస్తం.. ఒక్కొక్కనికీ మిత్తీతోసహా ఇస్తం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎవని అయ్యకూ భయపడం

కలెక్టర్​ అయినా.. వాని అయ్య అయినా.. అందరి పేర్లూ రాసి పెట్టుకోవాలని పార్టీ కేడర్‌‌కు కేటీఆర్​ సూచించారు. సర్కారుకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసుల లెక్కను బరాబర్​ తేలుస్తామని వార్నింగ్​ ఇచ్చారు. ఎవని అయ్యకూ.. రేవంత్​ ముత్తాతలకూ భయపడేది లేదన్నారు. సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక ఆస్కార్​ అవార్డు వచ్చినట్టు రేవంత్‌రెడ్డి మురిసిపోతున్నాడని, ఆయనకు ఆస్కార్​ కాదు భాస్కర్​ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 

హైదరాబాద్​ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్‌రెడ్డికి సపోర్ట్ చేసి కమీషన్లు ఇప్పించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క్విడ్ ప్రోకో కింద ఫ్యూచర్​ సిటీలో రూ.1600 కోట్ల కాంట్రాక్టును అప్పజెప్పారని అన్నారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్  సీఎం రేవంత్ రెడ్డి వందల కొద్దీ కాంట్రాక్టులు ఇస్తున్నా.. రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. 

రేవంత్‌రెడ్డిని మోదీ సర్కారు కాపాడుతున్నది 

రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్‌రెడ్డిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాపాడుతున్నదని కేటీఆర్​ఆరోపించారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని విమర్శించి ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటిదాకా కేంద్రం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలాగా మారిందని చెబుతున్న అమిత్ షా.. కేంద్ర హోంమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీలు నిస్సిగ్గుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి సాక్ష్యమన్నారు. రేవంత్‌కు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చేమోగానీ.. తెలంగాణ ప్రజల మద్దతు మాత్రం లేదని అన్నారు. 

వెల్ఫేర్​ కావాలంటే కేసీఆర్​ రావాలి

కామారెడ్డి/లింగంపేట,  వెలుగు: తెర్లయిన తెలంగాణ మళ్లీ మంచిగ కావాలంటే,  సంక్షేమం కావాలంటే కేసీఆర్‌‌ను తిరిగి  తెచ్చుకోవాలని కేటీఆర్​ అన్నారు.  శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేటలో  ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు. అంబేద్కర్​జయంతి రోజు పోలీసులు అరెస్ట్​ చేసిన మాజీ ఎంపీపీ సాయిలును సన్మానించారు. అనంతరం కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్​ పాలనలో తెలంగాణ ఆగమైంది.  అయినా  మళ్లీ వాళ్లకే ఓటు వేస్తామంటే  మీ ఇష్టం. 

మాకేమీ నష్టం లేదు. మీరు యాడ కూర్చోమంటే ఆడ కూర్చుంటం” అని అన్నారు.   అహంకారంతో  విర్రవీగుతున్న   సీఎం రేవంత్‌రెడ్డి,  అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ ఊరుకోబోమని అన్నారు.