
హైదరాబాద్ : ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగె కాంతారావు, ఆత్రం సక్కు ఆదివాసీల అభివృద్ధి కోసం, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. అయితే.. వాళ్లు TRS లో చేరనుండటంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను కేటీఆర్ ఖండించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం.. ఎప్పడికప్పుడు నిర్ణయాలు సమీక్షించుకుంటూ ముందుకు పోవడం కొత్త కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. BJP ఎంపీ సావిత్రీబాయి ఫూలెను కాంగ్రెస్ లో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ.. BJP ఎంపీని ఎంతకు కొన్నదని ప్రశ్నించారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు TRS నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మరి.. ఆయన్ను ఎంతకు కొన్నారు. TRS శాసనమండలి సభ్యులు యాదవరెడ్డి, భూపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. TRS బీఫామ్ మీద గెలిచిన వాళ్లు. దాని కంటే ఆరు నెలల ముందు 2014లో TDP నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరారు. ఆయన్ను ఎంతకు కొన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.