స్థానిక సంస్థల చరిత్ర.. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి..

 స్థానిక సంస్థల చరిత్ర..   పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి..

స్థానిక వనరులను సద్వినియోగం చేయడంలోనూ, మానవ వనరులను సద్వినియోగం చేయడంలోనూ ప్రతిపౌరుడు పరిపాలనలో భాగస్వాములు కావడానికి పంచాయతీరాజ్ సంస్థలు ఒక వేదికగా పనిచేస్తాయి. వందల, వేల కి.మీ.ల దూరంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ భారత ప్రజలకు అందుబాటులో లేకపోవచ్చు. కానీ, స్థానిక స్వపరిపాలన సంస్థలు పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంలో కీలకపాత్రను పోషిస్తాయి. పరిపాలనలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను నెలకొల్పడానికి ఆలంబనగా పనిచేస్తాయి. పంచాయతీరాజ్ సంస్థల కోసం రాజ్యాంగంలో 40వ అధికరణాన్ని చేర్చడం అంటే ఒక వాస్తవిక దృక్పథాన్ని  గౌరవించిన చర్యగా స్పష్టమవుతుంది. 

భారత గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలను లిటిల్ రిపబ్లిక్స్​గా చార్లెస్ మెట్​కాఫ్ వర్ణించాడు. ప్రాచీనకాలం నుంచే మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు పనిచేసినట్లు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. గ్రామ పరిపాలన కోసం గ్రామణి అనే అధికారి ఉండే వారని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతున్నది. శుక్రాచార్యుడు తన నీతిశాస్త్రంలో గ్రామాల కామన్​వెల్త్ ఉన్నట్లుగా పేర్కొన్నాడు. మధ్యయుగాల్లో స్థానిక స్వపరిపాలన నిర్లక్ష్యానికి గురైంది. నిర్మాణాత్మక సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కృషి చేయలేదు. మొగలుల కాలంలో ఏర్పాటు చేసిన కొత్వాల్ వ్యవస్థ శిస్తు వసూలు, శాంతి భద్రతల పరిరక్షణపై తప్ప అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేదు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరం అని పేర్కొనే బ్రిటీష్​వారు కూడా ప్రారంభంలో జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటుచేసి శిస్తు వసూలుపైనే దృష్టి కేంద్రీకరించారు. స్థానిక సంస్థల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. 1870లో లార్డ్ మేయో కాలంలో ప్రవేశపెట్టిన తీర్మానం బ్రిటీష్ వారి దృక్పథంలో మార్పును తెలియజేస్తుంది. 

మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ: 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల కోసం ప్రవేశపెట్టిన తీర్మానం మన దేశంలో స్థానిక స్వపరిపాలనకు మాగ్నాకార్టా వంటిదిగా పేర్కొన్నారు. అందువల్ల లార్డ్ రిప్పన్​ను భారతదేశ స్థానిక స్వపరిపాలన పితామహుడిగా అభివర్ణిస్తారు. రిప్పన్ నిర్ణయాత్మక, వ్యవస్థీకృతమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. లార్డ్ రిప్పన్ నమూనానే అనంతర కాలంలో మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణానికి బ్లూప్రింట్​గా పనిచేసింది. దేశం అంతటా స్థానిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్న రిప్పన్ స్థానిక సంస్థల్లో అధికారుల కంటే అనధికారులు ఎక్కువ ఉండాలని, వారంతా ప్రజాప్రతినిధులుగా ఉండాలని, వారిని ప్రజలే ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. 

రాయల్ కమిషన్:  1907లో బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థలను అధ్యయనం చేసి వాటిని పటిష్టపర్చడంపై నివేదికను సమర్పించింది. 1909 చట్టంలో స్థానిక పాలనపై ప్రత్యేకంగా ఎలాంటి స్థిర ప్రతిపాదనలనూ చేయలేదు. చార్లెస్ హబ్​ హౌజ్ నాయకత్వంంలో ఈ కమిషన్ ముఖ్యమైన సూచనలు చేసింది. అవి.. స్థానిక సంస్థలన్నిటి పునరుద్ధరణ, పరిపాలన వికేంద్రీకరణ, జనాభా ఆధారంగా మున్సిపల్ సంస్థల ఏర్పాటు. అంశాల ఆచరణలో బ్రిటీష్  ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు.

1918లో బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం స్థానిక సంస్థలు పన్నులు విధించే అధికారాన్ని కల్పించాలని, స్థానిక సంస్థల అధిపతులను ప్రజలే ఎన్నుకోవాలని, వారికి తగిన అధికారాలను కల్పించాలని పేర్కొన్నది. 1919లో ప్రవేశపెట్టిన మాంటేగ్– ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం దేశ పరిపాలన అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్థూలంగా విభజించింది. 1919 కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి స్థానిక స్వపరిపాలన రాష్ట్ర జాబితాలో ఉన్నది. అలాగే రాష్ట్ర పాలనాధికారులను రెండు జాబితాలుగా విభజించి భారతీయ మంత్రులకు అధికారాన్ని కల్పించిన ట్రాన్స్​ఫర్డ్ జాబితాలో స్వపరిపాలనను చేర్చారు. మొదటిసారి భారతీయులకు పరిపాలనపై అధికారం కల్పించడం వల్ల వారు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో  కొంత అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు.

రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి: భారత ప్రభుత్వ చట్టం–1935 రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించింది. అందువల్ల మనవాళ్లు స్థానిక పరిపాలన సంస్థలను పటిష్టపరచడానికి కొంతమేర కృషి చేశారు. 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.1947లో స్వాతంత్ర్యానంతరం దేశ పరిపాలనకు అవసరమైన రాజ్యాంగ రచన సందర్భంగా శ్రీమన్నారాయణ్ అగర్వాల్ రాజ్యాంగ పరిషత్​లో గ్రామస్థాయి మొదలుకుని దేశస్థాయి వరకు పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు గురించి తెలిపే గాంధీ ప్లాన్​ను ప్రతిపాదించారు. రాజ్యాంగం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లో 40వ అధికరణం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థతో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.  ఏడో షెడ్యూల్ లోని ప్రభుత్వ అధికారుల జాబితాల్లో స్థానిక స్వపరిపాలన అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నది. స్థానిక స్వపరిపాలన ఆదేశిక సూత్రాల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై మాత్రమే ఈ అంశం ఆధారపడి ఉండేది. 

ALSO READ : కాంగ్రెస్ హయాంలోనే టూరిజం డెవ్లప్ మెంట్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

73వ రాజ్యాంగ సవరణ చట్టం: భారత రాజ్యాంగ నిర్మాతలు స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి నాలుగో భాగంలో అంటే ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణంలో పొందుపర్చారు. రాష్ట్ర జాబితాలోని పంచాయతీరాజ్ సంస్థలను అమలుపర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలుపరచడానికి అవసరమైన చట్టాలను రూపొందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక స్వపరిపాలన సంస్థలకు సకాలంలో ఎన్నికలు నియమబద్ధంగా జరపకపోవడం, వాటికి అవసరమైన అధికారాలను, నిధులను బదిలీ చేయకపోవడం వల్ల గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో అవి సమర్థవంతంగా పనిచేయలేదు. అందవల్ల ఎల్ఎం సింఘ్వీ కమిటీ సూచనలను అనుసరించి పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం వల్ల వీటికి న్యాయసంరక్షణ లభించింది. అందువల్ల వీటి అమలు కోసం వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించే అవకాశం కూడా లభించింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 16 అధికరణలను చేర్చారు.