- రెండోస్థానంలో అస్సాం, థర్డ్ ప్లేస్‌లో మహారాష్ట్ర
- ముగిసిన గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు
- 9 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 150 మంది క్రీడాకారులు
హైదరాబాద్, వెలుగు: బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ లో మూడు రోజులపాటు నిర్వహించిన గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2025 పోటీలు శుక్రవారంతో ముగిసాయి. 9 రాష్ట్రాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అన్నీ విభాగాలలో తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది.
అస్సాం సెకండ్, మహారాష్ట్ర థర్డ్ ప్లేస్ కైవసం చేసుకున్నాయి. మూడు రోజుల పోటీల్లో గెలుపొందిన జట్లకు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి కప్‌లు, షీల్డ్‌లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ‘జంజాతీయ గౌరవ వర్షే (జేజేజీవీ)’లో భాగంగా దేశంలోనే మొదటిసారిగా ఈ కేనో స్ప్రింట్ జాతీయ స్థాయి పోటీలను రాష్ట్రంలో నిర్వహించారు.
ఈ కెనో స్ప్రింట్ రేసుల్లో పాల్గొన్న కోచ్‌లు, జడ్జీలు, అధికారులు, వాలంటీర్లను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. బిర్సా ముండా స్ఫూర్తి గిరిజన ఐక్యతకు మార్గదర్శిగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
క్రికెట్ ప్లేయర్ సిరాజ్, బాక్సింగ్ ప్లేయర్ నికితా జరీన్ ల ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రబుత్వం వారికి డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. 2036 ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సముజ్వల, సర్వేశ్వర్ రెడ్డి, సత్యనారాయణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.
