న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ సెప్టెంబర్ క్వార్టర్‌కి గాను రూ.3,479 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన రూ.5,603 కోట్లతో పోలిస్తే ఇది 37.9శాతం తగ్గింది.
క్యూ2లో రూ.2,067 కోట్ల విలువైన అసాధారణమైన ఖర్చు వలన కంపెనీ లాభం తగ్గింది. ‘‘ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో రూ.1,407 కోట్ల విలువైన పవర్ బెనిఫిట్ క్లెయిమ్‌ను రైటాఫ్ చేశాం. సెప్కోతో వివాదాన్ని పరిష్కరించుకోవడంలో భాగంగా తాల్వండి సాబో పవర్ యూనిట్‌కు రూ.660 కోట్లు చెల్లించాం.
వీటి వలనే అసాధారణ ఖర్చు జరిగింది”అని వేదాంత సీఎఫ్‌ఓ అజయ్ గోయల్ అన్నారు. కంపెనీ మొత్తం ఆదాయం క్యూ2లో ఏడాది లెక్కన 6 శాతం పెరిగి రూ.38,934 కోట్ల నుంచి రూ.40,464 కోట్లకు చేరింది. ఇబిటా 8శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి వేదాంత గ్రూప్ స్థూల అప్పులు రూ.83,544 కోట్లు.
