కరీంనగర్, వెలుగు : మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా ఆమె శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అలాగే అలుగునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మక్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువగా ఉన్న వడ్లను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.
అసలు ఐకేపీ సెంటర్లే లేకుండా.. డైరెక్ట్‌గా మిల్లర్లే వడ్లు కొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారన్నారు. అనంతరం శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడిని సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి మూడేండ్లు అవుతున్నా, రిపేర్ల కోసం గత ప్రభుత్వం రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వంగర బీసీ గురుకులంలో అనుమానాస్పదంగా చనిపోయిన విద్యార్థిని శ్రీవర్షిత కుటుంబ సభ్యులను పరామర్శించి, శ్రీవర్షిత మరణంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు.
