- ఇన్‌చార్జిగా సివిల్ ఈఈ దయాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు
యాదగిరిగుట్ట, వెలుగు : లంచం తీసుకుంటూ పట్టుబడిన యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. రామారావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఆలయ ఇన్‌చార్జి ఈవో హరీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామారావు ఇప్పటివరకు మూడు సార్లు సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. కారుణ్య నియామకం కింద 1997లో జూనియర్ అసిస్టెంట్‌గా డ్యూటీలో చేరిన రామారావు.. విధుల్లో నిర్లక్ష్యం, ఆలయ కంప్యూటర్లలో బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ దొరికిపోవడంతో 2000 సంవత్సరంలో అప్పటి ఈవో జీవీ.నరసింహమూర్తి సస్పెండ్ చేశారు.
తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడినందుకుగానూ 2024 ఆగస్టు 4న అప్పటి ఈవో, ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ముగిసి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే డ్యూటీలో చేరిన రామారావు తాజాగా లంచం తీసుకుంటూ పట్టుబడడంతో మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. రామారావు స్థానంలో సివిల్ విభాగం ఈఈ దయాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
