- రూ.42,344.20 కోట్లకు పెరిగిన ఆదాయం
- జీఎస్‌టీ తగ్గింపుతో కార్లకు డిమాండ్
- ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 10,78,735 బండ్లు అమ్మిన కంపెనీ
న్యూఢిల్లీ: కార్ల ఎగుమతులు పెరగడంతో మారుతి సుజుకీ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.3,349 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.3,102.5 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయం 13శాతం పెరిగి రూ.37,449.20 కోట్ల నుంచి రూ.42,344.20 కోట్లకు చేరింది.
బ్రోకరేజ్ కంపెనీలు వేసిన అంచనాలను మాత్రం కంపెనీ రిజల్ట్స్ అందుకోలేకపోయాయి. క్యూ2లో మారుతి సుజుకీకి రూ.3,458 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. అయినప్పటికీ ఆదాయం మాత్రం ఎనలిస్టులు అంచనా అయిన రూ.39,958 కోట్లను దాటింది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే, మారుతి సుజుకీ నికర లాభం క్యూ2లో ఏడాది లెక్కన 7.3శాతం పెరిగి రూ.3,069.20 కోట్ల నుంచి రూ.3,293.10 కోట్లకు చేరింది.
ట్యాక్స్, వడ్డీలకు ముందు లెక్కించే ప్రాఫిట్ (ఇబిటా) రూ.4,434 కోట్లకు పెరగగా, ఇబిటా మార్జిన్ మాత్రం 134 బేసిస్ పాయింట్లు తగ్గి 10.5శాతానికి పడిపోయింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది 11.9శాతంగా నమోదైంది. కంపెనీ ఖర్చులు 15.2శాతం పెరిగి రూ.33,879.10 కోట్ల నుంచి రూ.39,018.40 కోట్లకు పెరిగాయి.
3 నెలల్లో 5,50,874 బండ్ల అమ్మకం..
ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి కార్లపై జీఎస్‌టీ తగ్గడంతో సేల్స్ పెరిగాయని మారుతి సుజుకీ పేర్కొంది. జీఎస్‌టీ 2.0 అమల్లోకి రాకముందు చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేశారని, ఆ తర్వాత ఒక్కసారిగా సేల్స్ పెరిగాయని తెలిపింది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇండియాలో మారుతి హోల్‌సేల్ అమ్మకాలు 4,40,387 యూనిట్లకు చేరాయి.
ఎగుమతులు ఏడాది లెక్కన 42.2శాతం పెరిగి 1,10,487 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ ఒక క్వార్టర్‌లో ఇంతలా ఎగుమతులు సాధించడం ఇదే మొదటిసారి. మొత్తం అమ్మకాలు 1.7శాతం పెరిగి 5,50,874 యూనిట్లుగా రికార్డయ్యాయి. మారుతి సుజుకీ నెట్ సేల్స్ క్యూ2లో రూ.40,135.90 కోట్లకు పెరిగాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ.35,589.10 కోట్లుగా నమోదైంది.
ఆరు నెలల్లో 10 లక్షల యూనిట్లకుపైగా అమ్మకాలు..
ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కంపెనీ మొత్తం 10,78,735 బండ్లను అమ్మగలిగింది. ఇందులో 8,71,276 యూనిట్లను ఇండియాలో అమ్మగా, 2,07,459 బండ్లను ఎగుమతి చేసింది. కంపెనీ ఎగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మొత్తం అమ్మకాలు ఏడాది లెక్కన 1.4శాతం పెరిగాయి. ఏప్రిల్–సెప్టెంబర్‌లో కంపెనీ నికర అమ్మకాలు రూ.76,760.6 కోట్లకు చేరాయి.
కిందటేడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.69,464.4 కోట్ల విలువైన బండ్లను అమ్మగలిగింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ ఈ ఆర్నెళ్లలో రూ.6,719.1 కోట్ల నుంచి రూ.7,004.8 కోట్లకు పెరిగింది.
