Pawan Vs Prakash Raj : పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్.. ఛీ ఛీ అంటూ పోస్ట్!

 Pawan Vs Prakash Raj : పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్..  ఛీ ఛీ అంటూ పోస్ట్!

దేశ వ్యాప్తంగా హిందీ భాషపై మరోసారి దుమారం రేగుతోంది.  రాజకీయంగానే కాదు సినీ ఇండస్ట్రీలోనూ ఈ అంశంపై పెద్ద చర్చనడుస్తోంది.  నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) మరోసారి నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల  పవన్ కళ్యాణ్, ఓ కార్యక్రమంలో హిందీ భాష ప్రాముఖ్యతపై చేసిన వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. "దక్షిణాది రాష్ట్రాల ప్రజలు హిందీ నేర్చుకోవడం చాలా ముఖ్యం" అని పవన్ కళ్యాణ్ పేర్కొనడంపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి ఫ్యాన్ మధ్య పెద్ద వారే  నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమిటి?
హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ" అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఏకం కావడానికి హిందీ ఒక వారధి అని, విద్యా, ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం భాషా అడ్డంకులు లేకుండా ముందుకు సాగాల్సిన ప్రస్తుత తరుణంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశ భాషలు నేర్చుకోగలిగినప్పుడు, హిందీ నేర్చుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. "హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలపడటమే" అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దక్షిణాది సినిమాలు హిందీలో డబ్ అయ్యి భారీగా వసూలు చేస్తున్నప్పుడు, వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోడానికి వద్దు అనడం విడ్డూరమని ఆయన అన్నారు.

ALSO READ : Peddi : రామ్ చరణ్ 'పెద్ది'లో శివ రాజ్‌కుమార్ 'గౌర్ నాయుడు'గా ఎంట్రీ.. అభిమానులకు పండుగే!

ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ  సోషల్ మీడియా వేదికగా తన Xలో ఒక పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియోను రీట్వీట్ చేస్తూ, "ఈ రేంజ్ కి అమ్ముకోవడమా... ఛీ ఛీ #justasking" (Selling (yourself) for this? Ugh... how shameful!) అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్‌గా మారాయి, పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ప్రకాష్ రాజ్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పలువురు పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై సోషల్ మీడియాలో బెదిరింపులకు, దూషణలకు దిగారు.

 

భాషా వివాదం, రాజకీయ కోణాలు
గతంలో కూడా హిందీ భాషా రుద్దకంపై ప్రకాష్ రాజ్ తన గళాన్ని బలంగా వినిపించారు. "మీ హిందీ భాషను మాపై రుద్దకండి" అని చెప్పడం మరొక భాషను ద్వేషించడం కాదని, అది "స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం" అని ఆయన గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంటి దక్షిణాది నాయకుడి నుండి హిందీకి మద్దతు రావడంతో, ఈ భాషా వివాదం మళ్ళీ రాజుకుంది. ఒకవైపు దేశాన్ని ఐక్యం చేసే భాషగా హిందీని చూడాలని పవన్ కళ్యాణ్ అంటుంటే, మరోవైపు దక్షిణాది భాషల గుర్తింపును, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రకాష్ రాజ్ వంటి వారు వాదిస్తున్నారు. ఇప్పటికే హిందీ భాషపై దక్షిణాది రాష్ట్రలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు  నటుల మధ్య నెలకొన్న  ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.