
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో మోడీ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోడీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ డీఎన్ఏలో ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని విమర్శించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్న కేటీఆర్.. హైదరాబాద్ ఐటీ ప్రగతికి కేంద్రం చేసిందేమిలేదన్నారు. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసి..2013లో దానికి ఆమోదం తెలిపిందన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని మూలకుపెట్టిందని విమర్శించారు. హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమన్నారు కేటీఆర్. కేంద్రానికి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకనే, ఐటీఐఆర్ కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు.
ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉండి ఉంటే ఈ ఏడేళ్లలో హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదని కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్వేర్ పార్కులను ప్రకటించి తెలంగాణకు మెండిచేయి చూపడం..బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్ వేర్ పార్కులను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందనలేదన్నారు.