- నెల రోజుల్లో 1.12 లక్షల టన్నుల పత్తే కొన్నరు: కేటీఆర్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: పత్తి రైతులు సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందన్నారు. 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో 28.29 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే.. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నులే కొనుగోలు చేసిందన్నారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా.. దానిని 7 క్వింటాళ్లకు తగ్గించడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పంటను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ కూడా చొరవ చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.
అడ్డగోలు నిబంధనలు, కుంటిసాకులతో సీసీఐ కొనుగోళ్లను ఆపేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో కురిసిన ఎడతెగని వర్షాల కారణంగా పత్తి తడిసిపోయి, తేమ శాతం పెరిగి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పత్తి తేమ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే కొర్రీలు పెడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు.
జిన్నింగ్ మిల్లుల్లో అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
