అన్నా.. చాయ్​ తాగుదం పదా!  వామ్మో.. నీతో చాయ్​ తాగుడా?

అన్నా.. చాయ్​ తాగుదం పదా!  వామ్మో.. నీతో చాయ్​ తాగుడా?

అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్​, శ్రీధర్​బాబు మధ్య సరదా ముచ్చట

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ మధ్య గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ‘‘అన్నా.. స్మార్ట్ గా ఉన్నవ్. మరింత తెల్లగా కనిపించడానికా ఈ నల్ల కోటు వేసుకొని వచ్చినవ్..?’’ అంటూ శ్రీధర్ బాబును కేటీఆర్ పలుకరించారు. దీనికి శ్రీధర్​రాబు నవ్వి ఊరుకున్నారు. ఆ వెంటనే ‘‘చాయ్ తాగుదం పదా.. చాయ్ పే చర్చ పెడుదాం’’ అంటూ శ్రీధర్ బాబును కేటీఆర్​ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘‘వామ్మో.. నీతో చాయ్ తాగుడా? ఈ పరిస్థితుల్లో ఇంకేమైనా ఉందా!” అని శ్రీధర్ అన్నారు.

గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. స్పీకర్ కార్యాలయం ముందు నుంచి బయటకు బయలుదేరారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి పాత ఎల్​వోపీ ఆఫీస్ ముందుకు వచ్చారు. శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య అక్కడే ఏదో మాట్లాడుతుండగా.. కేటీఆర్ వారిని గమనించారు.ఈ సందర్భంగా శ్రీధర్​బాబు, కేటీఆర్​ మధ్య సరదా ముచ్చట్లు నడిచాయి. ఎర్రబెల్లి కల్పించుకుంటూ ‘‘సరే.. చాయ్ కి రాకున్నా ఫర్వాలేదు. కానీ ఉన్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలనైతే చూసుకో’’ అంటూ ముందుకు సాగారు. తర్వాత  పద్మా దేవేందర్ రెడ్డి ‘‘ఏందన్నా.. మాటిమాటికి ఆవు కథ లెక్క సభలో విలీనం గురించి మాట్లాడుడు” అని వెళ్లిపోయారు.

ఈ సమయంలోనే పక్కనే ఉన్న  స్మోకింగ్ ఫ్రీ జోన్ రూంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మజ్లిస్​ ఎమ్మెల్యే  అక్బరుద్దీన్​ ఒవైసీ  ఏదో చర్చించుకోవడం కనిపించింది.