
- లిస్ట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ప్రభుత్వం తరఫున నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్ ఇస్తం
- వెట్టిచాకిరి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్
- ఇకనుంచి ఫిబ్రవరి 9న అధికారికంగా వెట్టిచాకిరి విముక్తి దినోత్సవం
- సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని హామీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను వెట్టి చాకిరి విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుందని తెలిపారు. తమ శాఖ తరఫున నిధులు అందించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద తర స్నేహితుల సహాయం కూడా తీసుకుంటానని తెలిపారు. జాతీయ వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ, తెలంగాణ అసంఘటిత కార్మికుల సంఘం, స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వెట్టి చాకిరి, అక్రమ రవాణా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 8069 434343ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏడాది కేటాయిస్తున్న 3,500 ఇందిరమ్మ ఇండ్లలో వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని చెప్పారు.‘‘మీ ఇండ్ల జాబితా ఇస్తే, ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతా. వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తా. సొంత ఇల్లు ఉంటే పని చేసుకునే ధైర్యం వస్తుంది” అని తెలిపారు.
సీఎం దృష్టికి వెట్టిచాకిరి సమస్య
వెట్టి చాకిరి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.‘‘మీరు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తే.. నేను సీఎంను ఆహ్వానిస్తా. ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం ద్వారా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తోపాటు ఇతర శాఖల అధికారులకు కూడా దీనిపై అవగాహన పెరుగుతుంది. త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు” అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వెట్టి చాకిరిని నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కొనసాగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇక నుంచి ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. వెట్టి చాకిరి, మానవ అక్రమ రవాణా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. విముక్తి కలిగించిన కార్మికులకు తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని మంత్రి వివేక్‌వెంకటస్వామి అభినందించారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. లేబర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసే ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సందర్శనలు తగ్గాయని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. మేనేజ్‌మెంట్లు కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200కు పైగా వెట్టిచాకిరి విముక్తి కార్మికులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొన్న బాధలు విన్న సినీనటి, బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మాటలు తన మనసును కదిలించాయని, ఈ మహిళలకు తన పూర్తి సహకారం ఉంటుందని అమల ప్రకటించారు. కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరికి పాల్పడుతున్న వ్యాపారులు, గుత్తేదారులపై
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.