చేనేత కార్మికులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

చేనేత కార్మికులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చేనేత వస్త్రాలపై పన్నులు వేసిన బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో నేత కార్మికులు బుద్ధి చెప్పాలని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన చేనేత కార్మికులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ రంగంపై 5 శాతం ఉన్న జీఎస్టీని మోడీ ప్రభుత్వం 12 శాతానికి పెంచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ చరిత్రలోనే చేనేత వస్త్రాలపై పన్ను వేసిన ప్రభుత్వం లేదన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధినిస్తున్న టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ రంగాన్ని మోడీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు, బీమా పథకం, హౌస్ కం వర్క్ షెడ్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను మోడీ సర్కారు రద్దు చేసిందన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నేత కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఏటా రూ.1,200 కోట్లు కేటాయిస్తోందని తెలిపారు. చేనేతల పొదుపు పథకం కింద రూ.100 కోట్ల లబ్ధి చేకూర్చామని, రూ.లక్ష రుణ మాఫీతో 10,500 మందికి ప్రయోజనం కలిగిందని చెప్పారు. నారాయణపేట ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌, గద్వాలలో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుపల్, చౌటుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటంలోని నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.