సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నా..

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నా..

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రిగా కొనసాగుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదని..జరగాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇండ్లు లేని కుటుంబాలు 3 వేలు ఉన్నాయన్న ఆయన..ఇప్పటికే 2వేల ఇళ్లు నిర్మించామని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్ల వద్ద మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కులమతాలకు అతీతంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని.. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. వరంగల్లో 1250 ఎకరాలలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని.. దీన్ని ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఎవ్వరూ అడగకున్నా..తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టినట్లు చెప్పారు. దశల వారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. 

వర్కర్ టు ఓనర్ స్కీం ద్వారా మొదట 1100 మందికి లబ్ది కలిగేలా చూస్తామని కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని..70 కోట్ల బడ్జెట్ ను 1200 కోట్లకు పెంచినట్లు వివరించారు. నేతన్నల వస్త్రాలపై వేసిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఎందుకివ్వరని ప్రశ్నించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారిని ప్రజలు నిగ్గదీయాలని..8ఏళ్లలో ఎవరు ఏం చేశారో ఆలోచించుకోవాలని సూచించారు.