ఏడుగురు ఉండాల్సిన చోట..ఒక్కరూ లేకుంటె ఎట్ల?

ఏడుగురు ఉండాల్సిన చోట..ఒక్కరూ లేకుంటె ఎట్ల?
  •  ఆకస్మికంగా హాస్పిటల్​ తనిఖీ
  •  వచ్చినోళ్లు కనీసం రెండేండ్లైనా పనిచేయకుంటే ఎట్ల?
  •  గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడం లేదా?
  •  డాక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సర్కారు హాస్పిటళ్లలోని కొందరు డాక్టర్ల తీరుపై టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మండిపడ్డారు. చదువుకుని డాక్టర్లు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరిపై ఎంతో ఖర్చుపెడుతోందని, ఎంతో చేస్తోందని, అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పనిచేయడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కొందరు స్పెషలిస్టులు కొన్ని ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో పోస్టింగులు తీసుకుని, తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, ఓ రెండేండ్లు పనిచేస్తే తప్పేమిటని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్​లో గైనకాలజిస్టులు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్​ శుక్రవారం ఉదయం హాస్పిటల్​లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత డాక్టర్లు, అధికారులతో సమీక్షించారు. హాస్పిటల్​పై వస్తున్న ఫిర్యాదులకు కారణాలు, డాక్టర్లు, గైనకాలజిస్టులు, సిబ్బంది కొరత అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో ఎందుకు ఉండట్లేదు?

సిరిసిల్ల దవాఖానాలో గైనకాలజిస్టులు లేరని రోజూ తనకు సోషల్​ మీడియాలో పోస్టులు వస్తున్నాయని కేటీఆర్​ చెప్పారు. సర్కారు హాస్పిటళ్ల పట్ల విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​లో గైనకాలజిస్టులు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘సిరిసిల్ల ఏమైనా గిరిజన ప్రాంతమా, జిల్లా కేంద్రంలో పనిచేయడానికి డాక్టర్లు ఎందుకు ఇష్టపడటం లేదు. కొందరు డాక్టర్ల తీరు బాగోలేదు. ఇష్టం లేకుంటే పోస్టింగ్​లు తీసుకోవద్దు. వారు రాకుంటే ఎవరో ఒకరు వస్తారు. పోస్టింగ్​ తీసుకుని వెళ్లిపోతే.. డాక్టర్లు లేక జనం ఇబ్బంది పడతారు. అంతా కరీంనగర్​ పోతం, హైదరాబాద్​ పోతం అంటే ఎట్లా? ఆదిలాబాద్​ వంటి చోట్ల డాక్టర్లు పనిచేయడం లేదా? ప్రభుత్వం మీ డాక్టర్​ చదువు కోసం ఎంత ఖర్చు పెడుతోంది, ఎంత చేస్తోంది. రెండేండ్లు పనిచేస్తే ఏమైతది. అంతా పట్నాలకు పోతమంటున్నరు. ఏదైనా అంటే.. అట్లెట్ల చేస్తరు, ఇట్లెట్ల చేస్తరు అనుకుంట రాష్ట్రమంతా లొల్లి పెడ్తరు. ఇప్పుడింక యూనియన్లు పెట్టుకుంటున్నరు..”అని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో పేద ప్రజలు ఉంటారని, గర్భిణులను ఇతర ప్రాంతాలకు రెఫర్​ చేస్తే ఎలాగని ప్రశ్నించారు. డాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీకి ఫోన్​ చేసి.. సిరిసిల్ల హాస్పిటల్​కు నలుగురు గైనకాలజిస్టులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా రెండేండ్లైనా పనిచేయాలని చెప్పాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలని సూచించారు. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​లో త్వరలో సీటీ స్కాన్​ మిషన్​ ఏర్పాటు చేస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. హాస్పిటల్​కు కావాల్సిన మౌలిక వసతులు, సిబ్బంది, ఇతర సమస్యలను తన దృష్టికి తేవాలని సూచించారు.