ల్యాండ్‌‌ క్రూజర్ల కొనుగోళ్లపై విచారణ.. కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్‌‌పై ఎంక్వైరీ

ల్యాండ్‌‌ క్రూజర్ల కొనుగోళ్లపై విచారణ.. కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్‌‌పై ఎంక్వైరీ
  • రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్‌‌కు మంత్రి పొన్నం ఆదేశం 
  • ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ హయాంలో కొన్నవే.. 
  • అక్రమాలు జరిగినట్టు ఆధారాలుంటే చర్యలు తప్పవు: పొన్నం

హైదరాబాద్, వెలుగు: ల్యాండ్ క్రూజర్ల స్మగ్లింగ్ జరిగినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్‌‌‌‌తో పాటు రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ల కొనుగోళ్లు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్‌‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆదేశించారు. దీనిపై గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం స్పందించారు.

‘‘ప్రస్తుతం మంత్రు లు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ వెహికల్స్​ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నవి కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాటిని కోనుగోలు చేశారు. ఈ వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరిగినా, స్మగ్లింగ్ జరిగినట్టు ఆధారాలున్నా ప్రభు త్వ పరంగా చర్యలు తీసుకుంటాం. కేటీఆర్ వాడు తున్న ల్యాండ్ క్రూజర్ వాహనాలపై కూడా విచారణకు ఆదేశించాం” అని వెల్లడించారు. కాగా, కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్ బసరత్ ఖాన్ అనే డీలర్ నుంచి కొన్నదేనని, కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీ పేరు మీద ఉన్న ఆరు వాహనాలు కూడా అతని నుంచి తీసుకున్నవేనని కేంద్రమంత్రి బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్​చేశారు. 

జీఎస్టీ పేరుతో కేంద్రం దోచుకున్నది: పొన్నం  
దేశ ప్రజలను దోచుకునేందుకు కేంద్రానికి జీఎస్టీ ఒక ఆయుధంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శవపేటికల మీద కూడా జీఎస్టీ విధించారని, కేంద్రం జీఎస్టీ పేరుతో ఎనిమిదేండ్లుగా దేశ ప్రజలను దోచుకుంటున్నదని ఫైర్ అయ్యారు.

‘‘ఇప్పుడు కార్లు, టీవీల ధరలు తగ్గాయని బీజేపీ నేతలు అంటున్నారు. అంటే ఇన్ని రోజులు కేంద్రం దోచుకున్న విషయాన్ని వాళ్లు అంగీకరించినట్టే కదా. నిజానికి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కేంద్రం జీఎస్టీని తగ్గించింది. కానీ దేశం కోసం వాళ్లేదో త్యాగం చేసినట్టుగా మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది. జీఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం జరుగుతున్నది. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుతారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.