కాలనాగులతో జాగ్రత్త..కాలం బాలేకుంటే వానపాములు కూడా విషసర్పాలై బుస కొడ్తయ్: కేటీఆర్

కాలనాగులతో జాగ్రత్త..కాలం బాలేకుంటే వానపాములు కూడా విషసర్పాలై బుస కొడ్తయ్: కేటీఆర్
  • మలేసియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: ఒకనాటి వలసల తెలంగాణను, కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వ్యవసాయం మొదలుకొని పరిశ్రమల దాకా ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది ముమ్మాటికీ కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఇవేమీ తెలియని కొందరు నాయకులు తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయని విమర్శించారు. అలాంటి కాలనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మలేసియా  తెలుగు అసోసియేషన్, బీఆర్‌‌ఎస్ ఎన్నారై మలేసియా శాఖ సంయుక్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను శనివారం మలేసియాలో నిర్వహించారు. ఆ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన కేసీఆర్ నాయకత్వంలో పుష్కర కాలానికిపైగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమం వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు.

నాది తెలంగాణ అని చెప్పుకోవాలే

వేల ఏండ్ల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక రణాన్ని నడిపించిందని గుర్తుచేశారు. సాయుధ పోరాటాలైనా, ప్రజా ఉద్యమాలైనా, త్యాగాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా.. ప్రతిసారి తెలంగాణ జాతి తోటి ప్రజల కోసం కొట్లాడిందన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’ అని సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.

రాబోయే 25 ఏళ్లకు ప్రత్యేక విజన్

పదేండ్ల పాటు వెనుకబడిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌‌కు , బీఆర్ఎస్‌కు వచ్చే 25 ఏండ్ల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక విజన్ ఉందని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో 24 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ విజన్ అన్నారు. అలాగే ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు.