కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ పంచాయతీ

కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ పంచాయతీ

మంత్రి కేటీఆర్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని అన్నారు ఎంపీ అర్వింద్. కేసీఆర్ కుటుంబంలో గత 18 నెలలుగా సీఎం కుర్చీ పంచాయతీ నడుస్తోందని చెప్పారు. . కొడుకును సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్కెచ్ వేసిన కేసీఆర్కు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పచ్చి పట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించలేదనే కేటీఆర్ అలిగి అమెరికా వెళ్లిపోయాడన్న అర్వింద్.. తమ రాజకీయ భవిష్యత్ నాశమవుతుందనే హరీష్ రావు, సంతోష్ రావు, కవితలు ఆయన సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. 

బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు
బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. బోధన్లో శివాజీ విగ్రహ వివాదంలో ఇదే జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ను భ్రష్టుపట్టించారన్న అర్వింద్.. గతంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తప్పులు చేసి జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.  సీపీ నాగరాజు టీఆర్ఎస్కు చెంచాగా మారాడన్న ఆయన.. ఆర్మూర్లో తనపై జరిగిన దాడి వెనుక ఆయనే ఉన్నాడని ఆరోపించారు. అందుకే తన ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారు. 

ధాన్యం కొనుగోలుపై అనవసర రాజకీయం
పంట కొనే తెలివిలేని కవిత కార్పొరేటర్లను మాత్రం బాగానే కొనుగోలు చేస్తోందని అర్వింద్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం పూర్తి ధాన్యం కొంటామని చెప్పినా.. కేసీఆర్ మాత్రం ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.