గెలిచినా.. ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతం: జూబ్లీహిల్స్ ఓటమిపై KTR రియాక్షన్

గెలిచినా.. ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతం: జూబ్లీహిల్స్ ఓటమిపై KTR రియాక్షన్

హైదరాబాద్: ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై శుక్రవారం (నవంబర్ 14) ఆయన తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మా అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాల్లో కొత్తే అయినా బాగా కష్టపడ్డారని.. చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేశారని కొనియాడారు.

ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో, సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి.. కానీ ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని తెలిసిపోయిందన్నారు. 

 కాగా, దివంగత నేత మాగంటి గోపినాథ్ మరణంతో జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డ్ సృష్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు.