నిరుద్యోగులకు భయపడి కేటీఆర్​ కొత్త డ్రామా : కిషన్​రెడ్డి

నిరుద్యోగులకు భయపడి  కేటీఆర్​ కొత్త డ్రామా : కిషన్​రెడ్డి
  • టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన అంటూ మభ్యపెడ్తున్నడు: కిషన్​రెడ్డి
  • దొంగలు పడ్డంక ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆయన తీరు
  • బీఆర్​ఎస్​ టక్కుటమారా విద్యలను నిరుద్యోగులు నమ్మరని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల తర్వాత సీఎం అయినట్లుగా కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు పరిమితం చేయడం ఖాయమని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు భయపడి కేటీఆర్​ ఇప్పుడు కొత్తగా టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన అంటూ డ్రామాకు తెరలేపారని, ఇన్నిరోజులు ఎందుకు ప్రక్షాళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీపై  కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్న తీరు దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘‘మీ టక్కుటమారా విద్యలను, మీ ఎత్తులను, జిత్తులను తెలంగాణ యువత, నిరుద్యోగులు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు తలకిందికి పెట్టి తపస్సు చేసినా, మీ మాటలను నమ్మరు. బీఆర్​ఎస్​ను ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు ఓడించడం ఖాయం” అని కేటీఆర్​ను ఆయన హెచ్చరించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్​ 3న వచ్చే ఫలితాల్లో బీఆర్​ఎస్​ ఘోరంగా ఓడిపోనుంది. ఈ విషయాన్ని  గుర్తించిన కేటీఆర్.. డ్యామేజీ కంట్రోల్ లో భాగంగా టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన అంటూ కొత్త నాటకం మొదలుపెడ్తున్నడు. ఏరు దాటాక తెప్ప తగిలేసే బీఆర్​ఎస్​ నేతల వైఖరి గురించి తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తరు. ఇంకా వాళ్ల మాటలను నమ్మి, బీఆర్​ఎస్​కు ఓట్లు వేసి గెలిపిస్తారనుకుంటే... అది మూర్ఖత్వమే” అని అన్నారు. కేసీఆర్​ సర్కార్​పై నిరుద్యోగులు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే నెల 30న జరిగే ఎన్నికల్లో వారు సత్తా చాటి, బీజేపీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల ఆత్మహత్యకు మీరే కారణం

నిరుద్యోగులను కేటీఆర్​ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్​రెడ్డి అన్నారు. ‘‘గత మార్చి 12న టీఎస్​పీఎస్సీ పేపర్ల స్కామ్​ వెలుగు చూస్తే..  ఇప్పుడు ఎన్నికల సమయంలో దీనిపై కేటీఆర్ స్పందించడం.. యువతను, నిరుద్యోగులను మళ్లీ మభ్య పెట్టడమే. కేటీఆర్..! మీకు చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగాలు భర్తీ చేయాలన్న తపన ఉంటే.. సిట్ విచారణలో మీ ప్రభుత్వ పాపాలపుట్ట, అసమర్థత బద్ధలైనప్పుడే టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసేవాళ్లు. కానీ అవేవి పట్టించుకోకుండా లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నరు. నిరుద్యోగుల ఆత్మహత్యకు కారణం ముమ్మాటికి మీ పాపమే. రాజధాని నడిబొడ్డున ప్రవళిక అనే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవడం మీ పాపం కాదా..? ఆ విషయాన్ని తొక్కిపెట్టేందుకు లేని విషయాన్ని తెరపైకి తెచ్చిన్రు. ఇటీవల మెట్ పల్లికి చెందిన రెహమత్ అనే యువకుడు కూడా గ్రూప్ 1, 2 పరీక్షలు వాయిదా పడ్డాయని ఆత్మహత్య చేసుకుంటే.. మీ అధికారాన్ని ఉపయోగించి దాన్ని తొక్కిపెట్టడం వాస్తవం కాదా..” అని నిలదీశారు. బీఆర్​ఎస్​ పాలనలో 17 సార్లు పరీక్షల్ని వాయిదా వేసి, గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారని విమర్శించారు. 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్​ సర్కార్​ 80 వేల ఉద్యోగాలని ప్రకటన చేసి మోసం చేసిందన్నారు.  ‘‘డీఎస్సీ విషయానికి వస్తే.. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 13,600 టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. 5,089 ఉద్యోగాలకే నోటిఫికేషన్  ఇప్పించిండు. బిశ్వాస్ నివేదిక ప్రకారం పాఠశాల విద్యాశాఖలో అత్యధికంగా 23,978 ఖాళీలున్నాయి. 442 ప్రభుత్వ జానియర్ కాలేజీలు, 140 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 4,200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి.. ఇది నిజం కాదా?” అని ఆయన కేటీఆర్​ను ప్రశ్నించారు. గత రెండేండ్లుగా పేద విద్యార్థులకు బీఆర్​ఎస్​ సర్కార్​ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. యూపీఎస్సీ మాదిరిగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఇంటికో ఉద్యోగమిస్తామని అన్నారు. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.