
- టీఆర్‌ఎస్ మెంబర్‌షిప్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
- 10లోగా టార్గెట్ పూర్తి చేయాలని నేతలకు ఆదేశం
- గ్రేటర్ హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్‌లో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్ తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టార్గెట్‌లో సగం కూడా రీచ్ కాకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులతో ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో సమీక్షించారు. సికింద్రాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో 15 వేల సభ్యత్వాలే కాగా, ముషీరాబాద్‌లో 20 వేల సభ్యత్వాలు, సనత్‌నగర్‌లో 25 వేల సభ్యత్వాలు అయినట్టు పార్టీ ఇన్‌చార్జులు కేటీఆర్‌కు వివరించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ మెంబర్‌షిప్‌లో ఇంత వీక్‌గా ఉన్నామా? ఇంత మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉండి ఏం లాభం? ఒక నియోజకర్గంలో నెల రోజులు గడిచినా 15 వేల సభ్యత్వాలు కావా? ఇలాగైతే పార్టీ అధ్యక్షుడికి ఏం చెప్పుకోగలం.. మంత్రి నియోజకవర్గంలోనూ మెంబర్‌షిప్ కాకపోతే ఎట్లా? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు.. ఈ నెల 10లోగా అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలి.. మళ్లీ ఏదో చెప్తామంటే వినేది లేదు..’’ అని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 50 వేల టార్గెట్ ఇస్తే సగం కూడా రీచ్ కాలేరా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలను ఆయన ప్రశ్నించారు. ఇలా పనిచేస్తే నగరంలో పార్టీ మనుగడకు ఇబ్బంది తప్పదంటూ క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసింది.
హైదరాబాద్ సిటీలో ఒక్క జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 50 వేల సభ్యత్వాల టార్గెట్ పూర్తయిందని, అక్కడ ఎలా పనిచేశారో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అలాగే కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మధ్య సమన్వయం లేదని అందుకే టార్గెట్ రీచ్ కాలేకపోయారని కేటీఆర్ అన్నట్టుగా తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు యేడాదిలోపే ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కాస్త కఠువుగా చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని, వ్యక్తిగత ఎజెండాలు పక్కనపెట్టాలని సూచించినట్టు తెలిసింది. హైదరాబాద్ సిటీ మెంబర్‌షిప్ ఎంత దారుణంగా ఉందో అందరి ముందు రివ్యూ చేస్తే బాగుండదనే ఈ రోజుకు వాయిదా వేశానని, ఈ మధ్య వ్యవధిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్లు ఉన్నారని, అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా 5 వేలకు మించి మెంబర్‌షిప్ కాలేదని, ఇక అక్కడి నియోజకవర్గాలపై సమీక్షించి కూడా లాభం లేదని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. గ్రామీణ నియోజకవర్గాల్లో టార్గెట్‌ను మించి 10 వేలు, 15 వేల సభ్యత్వాలు అధికంగా చేయగా, అధిక జనాభా, ఓటర్లున్న హైదరాబాద్‌లో చేయలేరా అంటూ ప్రశ్నించినట్టుగా సమాచారం. ఆషాడం మొత్తం హైదరాబాద్‌లో బోనాల పండుగ పెద్ద ఎత్తున చేస్తారని, అందరూ పండుగ మూడ్‌లో ఉండటం వల్లే సభ్యత్వాల టార్గెట్ చేరుకోలేకపోయామని నేతలు వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది.
6 నుంచి గ్రేటర్లో కేటీఆర్ పర్యటన
గ్రేటర్ శివారు నియోజకవర్గాల్లోనూ పది రోజుల్లోగా మెంబర్‌షిప్ టార్గెట్ పూర్తి చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 6 నుంచి తాను గ్రేటర్ సిటీలోని డివిజన్లలో పర్యటిస్తానని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని, పార్టీ పేరును అందరి నోళ్లలో నానేలా పనిచేయాలని సూచించారు. మెంబర్‌షిప్ ప్రక్రియ పూర్తి కాగానే ఈ నెల 10 నుంచి 20 మధ్య బూత్, బస్తీ, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.