ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​తో భవిష్యత్తు తరాలకు ఉపయోగం

ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​తో భవిష్యత్తు తరాలకు ఉపయోగం
  •     కేయూ వీసీ తాటికొండ రమేశ్​
  •     ముగిసిన మూడు రోజుల సదస్సు

హసన్‌పర్తి, వెలుగు : ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్ నిర్వహణతో భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగం కలుగుతుందని, అలాంటి ఈవెంట్ ను కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించడం చరిత్ర పుటల్లో లిఖించదగ్గ సందర్భమని కేయూ వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ అన్నారు. ఈనెల 28న కేయూ ఆడిటోరియంలో ప్రారంభమైన మూడు రోజుల ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ముగింపు ఉత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరు కావాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల వారు అటెండ్​ కాలేకపోయారు.

దీంతో కేయూ రిజిస్ట్రార్​ శ్రీనివాస రావు అధ్యక్షతన ముగింపు సమావేశం నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​ గా వీసీ రమేశ్​ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫలప్రదమైన చర్చలు, ప్రసంగాలు జరిగాయన్నారు. వాటితో నూతన విజ్ఞానం కలగడంతో పాటు ఆలోచనల మార్పిడి జరిగిందని, ఈ పరిణామాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయన్నారు. వివిధ సెషన్లలో చరిత్ర పరిశోధకులు 1,146కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. 

సెమినార్​ హాల్​కు ఆచార్య బొబ్బిలి పేరు

కేయూ హిస్టరీ విభాగానికి, దేశ చరిత్ర విభాగాల అకాడమిక్​ సంస్థలకు దివంగత రిటైర్డ్​ ప్రొఫెసర్​ బొబ్బిలి విశిష్ట సేవలందించారని వీసీ రమేశ్​  అన్నారు. ఆయన జ్ఞాపకార్థం హిస్టరీ డిపార్ట్​మెంట్​ సెమినార్​ హాల్​కు ‘ఆచార్య బొబ్బిలి సెమినార్​ హాల్’ గా నామకరణం చేశారు. అనంతరం వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.

ముగింపు సమావేశంలో ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్  జనరల్​ ప్రెసిడెంట్​ ప్రొఫెసర్​ ఆదిత్య ముఖర్జీ, ప్రతినిధులు ఎస్ఏ నదీం రెజావి, ఎస్​ రేఘి, జాఫ్రీ, ఎస్.​ శ్రీనాథ్ తదితరులను వీసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ లోకల్​ సెక్రటరీ ప్రొఫెసర్​ టి.మనోహర్​, డాక్టర్​ వల్లాల పృథ్వీరాజ్​ తదితరులు పాల్గొన్నారు.