యాదగిరిగుట్టపై కళాకారుల ఇక్కట్లు

యాదగిరిగుట్టపై కళాకారుల ఇక్కట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం తర్వాత కళాకారులకు కొండపైన నిలువ నీడ లేకుండా పోయింది. దీంతో ఆలయం బయటే కళాకారులు నృత్య ప్రదర్శన చేయాల్సి వస్తోంది. ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన సాంస్కృతిక విశ్వ కళామండలి ఆధ్వర్యంలో 50 మంది కళాకారులు కొండపై ముసురులో తడుచుకుంటూనే కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు కొండపై కళాకారులు నృత్య ప్రదర్శన చేయడానికి ప్రత్యేకంగా సంగీత్ భవన్ ఉండేది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు, నారసింహుడి జయంతి ఉత్సవాలతో పాటు పలు పర్వదినాలలో కళాకారులు సంగీత్ భవన్ లో ప్రదర్శనలు ఇచ్చేవారు. సంగీత్ భవన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి విశాలమైన వేదిక, మహిళ, పురుష కళాకారులకు వేర్వేరుగా వాష్ రూమ్స్, టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ వంటి సదుపాయాలు ఉండేవి. కళాకారుల కోసం ఏర్పాటు చేసిన వేర్వేరు రూములలో మేకప్ వేసుకుని డయాస్ పై కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేసేవారు. కానీ ఆలయ పునర్నిర్మాణం కోసం కొండపైన ఉన్న సంగీత్ భవన్ ను కూల్చివేసిన ఆఫీసర్లు.. మళ్లీ నిర్మించలేదు.

మాడవీధుల్లో మేకప్, వానలో నృత్యం
కొండపైన ఉన్న సంగీత్ భవన్ కూల్చివేయడంతో కళాకారులు నృత్య ప్రదర్శన చేయడానికి అడ్డా లేకుండా పోయింది. దీంతో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాడవీధుల్లో మేకప్ వేసుకుని ఆలయం వెలుపల వానలో తడుస్తూనే కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శన చేశారు. కళాకారుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండడం, వాష్ రూమ్స్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ముసురులో తడుస్తూనే కళాకారులు చేస్తున్న నృత్య ప్రదర్శన చూడడానికి భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రదర్శనను తిలకించారు.