భద్రాచలం, వెలుగు : ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా 27వ రోజైన ఆదివారం భద్రాద్రి రామాలయంలో కూడారై ఉత్సవాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రామాలయ ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా తిరుప్పావై, తిరుపళ్లేచ్చి ప్రబంధాలను నివేదన సమయంలో అనుసంధానం చేశారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుడితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయసాన్నం నివేదన చేస్తానని సుందర బాహుస్వామికి మొక్కుకుంటుంది.
ఈ సమయంలో అమ్మవారితో శ్రీరంగనాథుని వివాహం జరగడం, ఆయనలో ఐక్యం అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏటా ధనుర్మాస మహోత్సవాల సమయంలో కూడారై ఉత్సవాన్ని అమ్మవారిని స్మరించుకుంటూ రామాలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో మహిళా ముత్తైదువులకు గోదాదేవి ప్రతిమలను ఇచ్చి షోడశోపచారాలతో శ్రీకృష్ణ, గోదా అష్టోత్తరాన్ని భక్తి ప్రవత్తులతో పఠించారు. చివరకు కూడారై పాశురాన్ని నక్షత్ర హారతితో నీరాజనం ఇస్తుండగా పఠించారు.
ఉత్సవాల్లో దేవనాథ రామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, రామస్వరూపాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామికి సుప్రభాత సేవను చేసి బాలబోగం నివేదించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మంజీరా(పసుపు ముద్ద)లు అద్ది స్నపన తిరుమంజనం చేశాక భక్తులకు అభిషేక జలాలను, మంజీరాలను భక్తులకు పంపిణీ చేశారు.
మూలవరులను అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన భక్తిప్రవత్తులతో నిర్వహించారు. స్వామిని బేడా మండపానికి తీసుకెళ్లి అధ్యయన పారాయణోత్సవం పూర్తి చేశాక నిత్య కల్యాణం చేశారు. కంకణాలు ధరించి భక్తులు క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం గోదాదేవి అమ్మవారికి తిరువీధి సేవ జరిగింది.
శ్రీకృష్ణదేవాలయంలో..
ధనుర్మాసోత్సవంలో భాగంగా భద్రాచలంలోని శ్రీకృష్ణ దేవాలయంలో కూడారై ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోదాదేవి శ్రీరంగనాథునికి తిరుప్పావై పూజలు చేసి వ్రతంలో భాగంగా స్వామికి 108 గంగాళాలతో పాయసాన్ని నివేదించే ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. 108 మంది మహిళలు తమ సంకల్పాన్ని చెప్పుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది.
