ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తికి ఏడాది జైలు

ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తికి ఏడాది జైలు
  •     శిక్ష విధించిన కూకట్​పల్లి కోర్టు

జీడిమెట్ల, వెలుగు : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ కూకట్ పల్లి కోర్టు తీర్పునిచ్చింది. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునావత్ రమేశ్ నాయక్(46) సిటీకి వచ్చి దేవేందర్ నగర్ లోని కట్టమైసమ్మ బస్తీలో ఉంటూ ప్రైవేటు వర్క్ చేస్తున్నాడు. గాజుల రామారంలో సర్వే నం. 329/1లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు నోటరీ చేసి ఇతరులకు అమ్ముతున్నాడు.

రమేశ్ నాయక్ కబ్జాలపై అప్పటి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కు ఫిర్యాదులు అందడంతో 2019 మార్చి 11న పరిశీలించి అక్రమ కట్టడాలను కూల్చి వేయించారు. ఆ తర్వాత కూడా రమేశ్ నాయక్ క్వారీ గుంతలు పూడ్చి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేసేందుకు వెళ్లగా.. రమేశ్ వారిని అడ్డుకుని దాడికి దిగాడు.

దీంతో రెవెన్యూ సిబ్బంది జగద్గిరిగుట్ట పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమేశ్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అతడిని శుక్రవారం కూకట్ పల్లిలోని 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుటు హాజరుపరిచారు. నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.3 వేల ఫైన్ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.