చెరువును కాపాడినం.. ముంపు సమస్య తీర్చినం

చెరువును కాపాడినం..  ముంపు సమస్య తీర్చినం
  • హైడ్రా కమిషనర్​ రంగనాథ్​
  • కూకట్​ పల్లి నల్లచెరువు సందర్శన
  • ఆక్రమణలు తొలగించడంతో 12 ఎకరాల విస్తీర్ణం పెరిగిందని వ్యాఖ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడటమే కాకుండా దాని విస్తీర్ణాన్ని రెట్టింపు చేశామని, అంతేగాకుండా కాలనీల్లో ముంపు సమస్యను పరిష్కరించామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ చెప్పారు. గురువారం ఆయన కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి నల్లచెరువును సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆక్రమణలను తొలగించి, 4 మీటర్ల లోతు మట్టిని, పేరుకుపోయిన పూడికను, నిర్మాణ వ్యర్థాలను హైడ్రా తొలగించిందన్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్  పరిధిలో 16 షెడ్డులను తొలగించామన్నారు. ఇంతకుముందు చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు ఉండగా ఇప్పుడు 28 ఎకరాలకు పెరిగిందన్నారు. 

పిక్నిక్​ స్పాట్​లా చెరువు..

చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే నిర్మించామని, రోజూ 600 మంది ఉపయోగిస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మారుతున్నాయని రంగనాథ్​ సంతోషం వ్యక్తం చేశారు. చెరువులో ఐల్యాండ్స్ నిర్మించామని, బోటింగ్ సౌకర్యం, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.