
మణుగూరు, వెలుగు : ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీం ఆశయాలను సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. మణుగూరు మండలం బీటీపీఎస్ వద్ద నిర్మించిన కుమ్రం భీం విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఆదివాసీలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఆదివాసీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని సీఎంను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీటీపీఎస్ నిర్మాణంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఈ విషయంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఆదివాసీల జీవనాధారమైన భూములను తీసుకున్న ఆఫీసర్లు.. వారికి ఉవాల్సిన ఉద్యోగాలు, పరిహారాన్ని కొల్లగొట్టారన్నారు.
ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై త్వరలోనే విచారణ చేపడుతామన్నారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొరతో పాటు పలువురు ఆదివాసీ లీడర్లు పాల్గొన్నారు.