కుమ్రం భీం పోరాట స్ఫూర్తి నేటికీ అవసరం

కుమ్రం భీం పోరాట స్ఫూర్తి నేటికీ అవసరం

స్వయం పాలన కోసం పోరాడిన తెలంగాణ బిడ్డ కుమ్రం భీం. ఆయనో అగ్గి బరాటా. గెరిల్లా పోరాటంలో మడమ తిప్పని యోధుడు. ‘జల్, జమీన్, జంగల్’ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం పోరాడాడు. హైదరాబాదు విముక్తి కోసం నిజాం రాజులను ఎదిరించి నిలిచాడు. అక్టోబర్​ 22న కుమ్రం భీం జయంతి సందర్భంగా..

ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లి గ్రామంలో గిరిజన గోండు తెగకు చెందిన కుమ్రం చిన్నూ,- సోంబాయి​ దంపతులకు 1901 అక్టోబర్​ 22న కుమ్రం భీం జన్మించాడు. ఆయన పదిహేనేండ్ల వయసులో ఉన్నప్పుడు అప్పటి ఫారెస్టు సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి చనిపోయాడు. దాంతో కుమ్రం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్‌కు వలస వెళ్లింది. అక్కడ కుమ్రం కుటుంబం సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అనే జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేక అతడిని చంపేసి మహరాష్ట్ర, ఆ తర్వాత అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ ఐదేండ్ల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేసి.. తర్వాత తిరిగి కరిమెరకు వచ్చాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన పన్నులకు వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమం మొదలుపెట్టాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీంకు తోడుగా కుమ్రం సూరు, వెడ్మ రాము ఉద్యమంలో పాల్గొన్నారు.

పోరాటమే మార్గమని..

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుమ్రం భీం. స్వయం పాలన, అస్తిత్వ ఉద్యమాల వేగు చుక్క. పోరాట పంథానే చివరికి సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాలా నమ్మిన యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డెబ్భై రెండేండ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం జయంతి, వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయం పాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్ల ముందు కనబడుతున్నయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటీష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సా ముండా, సంతాల్‌లు తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలకు దిగారు.

అణచివేతకు వ్యతిరేకంగానే..

ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడి లేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడవి నుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే.. ఆదిలాబాద్ గోండులు పోరుబాట పట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’ అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కుమ్రం భీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీ వర్గాలను ఎదిరించారు. ఈ పోరాటం అంతటా విస్తరించే లోపే నిజాం సేనలు భీం సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులను పొట్టనపెట్టుకున్నాయి. భీం త్యాగం జోడేఘాట్ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ పోరాటం చేయవలసి వస్తున్నది.

మనుగడే ప్రశ్నార్థకమైంది

గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె, కోయలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు ముందు వలస బంజారాల జనాభా కేవలం పదివేలేనని హైమన్‌ డార్ఫ్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు వారి జనాభా పదింతలకుపైన ఉంది. వలస వచ్చినవాళ్లు ప్రజాప్రతినిధులు అవడంతో ఆదివాసీల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం రక్షణ కోల్పోయింది. ఇలాగైతే తమ మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు కలవరపడుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఏటా విష జ్వరాలతో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నా ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడం లేదు. పోషకాహార లోపంతో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కే లేదు. కుమ్రం భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికీ తాగడానికి నీళ్లు, సరైన సదుపాయాలు లేవు.

ఇప్పటికీ కుమ్రం భీం మార్గమే స్ఫూర్తి

కుమ్రం భీం పోరాటం జరిగి 80 ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ  ఆ పోరాట స్ఫూర్తి ఉంది. అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో… 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసం, న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం కుమ్రం భీం పోరాటం చేశాడు. అప్పట్లో గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చెలాయించింది. పంటను కొట్టిన కల్లంలోనే పన్ను కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనుల పోడు భూములకు పట్టాదారులుగా ఇతరులు అధికారం చెలాయించేవారు. గిరిజనులు ఎంత దట్టమైన అడవిలో భూములు సాగుచేసుకున్నా వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవారు. ఈ ఘటనలే కుమ్రం భీంను కదిలించాయి. పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధిఖి అనే జమీందారును కర్రతో తల పగలకొట్టాడు. తర్వాత భయపడి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు. అక్కడినుంచి అస్సాం వెళ్ళాడు.  తేయాకు తోటల్లో పనిచేస్తూ చదవడం, రాయడం, మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, మార్కెట్‌లో మంచి ధరకు అమ్మడం తెలుసుకున్నాడు. తిరిగి వచ్చాక గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ముందు నిలిచాడు. కానీ ఆదివాసీలు ఇప్పటికీ జల్, జంగిల్, జమీన్‌పై హక్కులు పొందలేకపోతున్నారు. ప్రభుత్వాల తీరు మారడం లేదు. ఇప్పటికైనా కుమ్రం భీం స్ఫూర్తిని పాటించాలి. ఆదివాసీల సంక్షేమానికి పెద్ద పీట వేయాలి. మంచి విద్య, వైద్యం అందించాలి. కుమ్రం భీం జయంతిని అధికారికంగా జరపాలి.

ఇప్పుడూ అదే అణచివేత

ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా ఆదివాసీల అవస్థలు ఏమీ తీరలేదు. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అనేక సార్లు ఓటమి చెందినా.. తమ జీవితమే యుద్ధమైన చోట అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. వాస్తవానికి నిజాం రాజు కూడా తాను నియమించిన హైమన్‌ డార్ఫ్ కమిషన్​ సూచనలను పాటించాడు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కుమ్రం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరోసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దానిని తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్రవెల్లి మారణకాండను సృష్టించింది. ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలా భాగ్‌గా ప్రజాస్వామికవాదులు ఈ ఘటనను పిలుస్తున్నారు. ఆ ఘటనతో దేశవ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీభావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే రాజ్యం తన హేయమైన చర్యలకు పాల్పడుతూనే.. మరోవైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా.. పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్​ను తుంగలో తొక్కి.. ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నరు. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70ను అమలు చేయడం లేదు.అన్యా క్రాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోవడం లేదు.

దేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన యోధుడు కుమ్రం భీం. కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీలకు అడవిపై హక్కు అనేది సామాజిక న్యాయంలో భాగమని నినదించాడు.  1928 నుంచి 1940 వరకు తన పోరాటాలతో నిజాం సర్కార్ కు దడ పుట్టించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కుమ్రం భీం స్థావరాన్ని చుట్టుముట్టి భీంను చంపేసింది. ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కుమ్రం భీం వీర మరణం పొందాడు. అప్పటి నుంచి ఆ తిథి నాడే కుమ్రం భీం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.

కామిడి సతీశ్ రెడ్డి,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
రాష్ట్ర సహాధ్యక్షుడు