ప్రతి గుడిసెకు పట్టా.. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి

ప్రతి గుడిసెకు పట్టా.. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి
  •     అప్పటివరకు మా పోరాటం ఆగదు: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్లు, గుడిసెవాసులందరికీ ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో దశ ఉద్యమంలో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరా పార్క్ వద్ద లక్షలాది మందితో నిర్వహించనున్న మహా ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూం భవన్‌‌‌‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ ధరణి పోర్టల్  పేదలకు  అన్యాయం చేసిందని మండిపడ్డారు.   

సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వల లెక్కలపై గందరగోళం నెలకొందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.  హరీశ్‌‌‌‌రావు హయాంలో 75 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను తప్పుగా చూపించారని, ఇప్పుడు అదే నిజమని వారే అంగీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ..  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.