- 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరువు సాయం, సహాయక చర్యల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. కరువు నిధుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. నీటి కొరతతో పంటలు వేయలేకపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున కరువు సబ్సిడీ ఇవ్వాలన్నారు.
కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడతామని, ఆ తర్వాత మండలాల్లోనూ నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు సమస్యలు, కరువుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విధి నిర్వహణలో మరణించిన మహిళా కండక్టర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించిందని ప్రకటించారు.
