పేదలకు భూపట్టాలివ్వకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

పేదలకు భూపట్టాలివ్వకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  •     భూదాన్, ప్రభుత్వ భూముల్లో ఉంటున్నవారికి హక్కు కల్పించాలి: కూనంనేని

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ, భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు తక్షణమే పట్టాలివ్వాలని, ఒకవేళ ఆ గుడిసెలను తొలగించాలని చూస్తే ప్రాణాలకు తెగించి ప్రతిఘటిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది గుడిసెవాసులు తరలొచ్చారు. ‘‘ఉంటే భూమిపై ఉంటం.. లేకపోతే జైల్లో ఉంటం”అంటూ వారి నినాదాలతో ధర్నా చౌక్ హోరెత్తింది. 

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. పేదలకు ఇండ్ల స్థలాలు దక్కే వరకు సీపీఐ విశ్రమించబోదన్నారు.లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను బడా బాబులు కొల్లగొట్టారని, వాటిని స్వాధీనం చేసుకుంటే రాష్ట్ర బడ్జెట్‌‌కు సరిపడా నిధులు వస్తాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. రావి నారాయణ రెడ్డి వంటి మహానుభావుల త్యాగాలతో వచ్చిన భూదాన్ భూములు పేదలకే చెందాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా మధ్యతరగతి ఇండ్లను కూలుస్తోందని.. పేదల పట్టాల విషయంలో ఎందుకు జాప్యం చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రశ్నించారు.