కనుల పండువగా అలంకారోత్సవం.. ఆభరణాల శోభాయాత్రకు కలిది వచ్చిన భక్తులు

కనుల పండువగా అలంకారోత్సవం..  ఆభరణాల శోభాయాత్రకు కలిది వచ్చిన భక్తులు
  • మార్మోగిన వేంకటేశ్వరుడి నామస్మరణ
  • అమ్మాపూర్​లోని సంస్థానాధీశుల నివాసంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు
  • పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
  • ఆభరణాలను దర్శించుకున్న 
  • ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట/మదనాపురం, వెలుగు : కురుమూర్తి వేంకటేశ్వరస్వామి అలంకారోత్సవం కన్నుల పండువగా సాగింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ముక్కెర వంశస్తులు చేయించిన ఆభరణాలను స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ముక్కెర వంశస్తులు స్వామి కోసం తయారు చేయించిన ఆభరణాలను వనపర్తి జిల్లా ఆత్మకూర్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో భద్రపర్చిన లాకర్​నుంచి రాజా శ్రీరాంభూపాల్, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, బ్యాంకు సిబ్బందితో కలిసి ఆభరణాల పెట్టెను బయటకు తీశారు.

 అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్​నగర్​డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, స్వర్ణాసుధాకర్ రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆభరణాలను దర్శించుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆభరణాల ఊరేగింపు ప్రారంభమైంది.

ఊరేగింపుగా ఆభరణాలు..

ఆత్మకూరు ఎస్బీఐ నుంచి గాడి వంశస్తులు ఆభరణాల పెట్టెను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా బయల్దేరారు. ఆత్మకూరు గ్రామం శివారులోకి వచ్చాక.. ప్రత్యేక వాహనంలో ఆభరణాల పెట్టెను ఉంచారు. మార్గమధ్యలో కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల్లో ఆభరణాల పెట్టెను బయటకు తీసి ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు పూలు చల్లుతూ హారతులు పట్టారు. అక్కడి నుంచి అమ్మాపూర్ గ్రామానికి మధ్యాహ్నం 1.40 గంటలకు ఆభరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గాడి వంశస్తులు ముక్కెర వంశస్తులైన రాజా శ్రీరాం భూపాల్​నివాసానికి ఆభరణాల పెట్టెను చేర్చారు. సంస్థానాధీశులకు వాటిని అప్పగించారు. 

అనంతరం సంస్థానాధీశులు ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ పాల్గొని ఆభరణాలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆభరణాలపెట్టెను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్లు, గోవింద నామస్మరణ చేసుకుంటూ కురుమూర్తి గుట్టలపైకి మోసుకెళ్లారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆలయానికి ఆభరణాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆభరణాల లెక్క చూసి స్వామి పూజారులకు అప్పగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. స్వామి అమ్మవార్లను ఆభరణాలను అలంకరించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. 

పట్టువస్ర్తాల సమర్పించిన మంత్రి..

మంత్రి వాకిటి శ్రీహరి కురుమూర్తి వేంకటేశ్వరస్వామికి పట్టు వస్ర్తాలను తయారు చేయించారు. ఈ సందర్భంగా ఆభరణాల ఊరేగింపులో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఆయన ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, ఎమ్మెల్యే జీఎంఆర్​తో కలిసి డోలును వాయించారు. ఈ సందర్భంగా భక్తీ గీతాలకు కోలాటం వేశారు. మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాల ఎస్పీలు డి.జానకి, గిరిధర్ రావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు 
తీసుకున్నారు. 

ఆభరణాల పెట్టెలో ఉండేవి ఇవే..

కురుమూర్తి వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవీలకు ముక్కెర వంశస్తులు వజ్రాలు, వైడుర్యాలతో బంగారు ఆభరణాలు చేయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వాటిని స్వామి, అమ్మవార్లకు అలంకరించి, ఉత్సవాలు ముగిశాక అలంకారం తీసేతారు. వాటికి ప్రత్యేకంగా తయారు చేయించిన పెట్టెలో పెట్టి ఎస్​బీఐలో లాకర్​లో భద్రపరుస్తారు. 

ఆభరణాల పెట్టెలో స్వామివారికి వజ్ర వైడూర్యాలతో పొదిగిన బంగారు కిరీటం, అభయ హస్తాలు, కెంపులు, పచ్చలహారం, బిల్లలతో కూడిన బంగారు మొలతాడు, కంఠహారం, భూజ కిరీటాలు, శంఖుచక్రాలు, కోర మీసాలు ఉంటాయి. అమ్మవారికి బంగారు పుస్తెలు, వడ్డానం, కెంపులు, పగడాలు, ముత్యాల హారం, బంగారు పాదుకలు ఉంటాయి.