IPL 2025: ప్లే ఆఫ్స్‎కు జోస్ బట్లర్ దూరం.. శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‎ను రంగంలోకి దించిన గుజరాత్

IPL 2025: ప్లే ఆఫ్స్‎కు జోస్ బట్లర్ దూరం..  శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‎ను రంగంలోకి దించిన గుజరాత్

గాంధీ నగర్: భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యజమాన్యాలకు ఇబ్బందిగా మారాయి. పాక్, భారత్ మధ్య యుద్ధ భయంతో ఐపీఎల్‎ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో 2025, మే 17 నుంచి తిరిగి క్యాష్ రిచ్ లీగ్‎ను పునః ప్రారంభిస్తున్నారు. వారం రోజుల పాటు లీగ్ వాయిదా పడటంతో బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఐపీఎల్ షెడ్యూల్ మారడంతో ఫారెన్ ప్లేయర్స్‎ తమ జాతీయ జట్లకు సంబంధించి ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ కావడంతో ఐపీఎల్‎కు దూరమవుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే గుజరాత్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‎కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నెల (మే) 29 నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‎కు జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. దీంతో అతడు ఐపీఎల్ ఫ్లే ఆఫ్స్‎కు దూరం కానున్నాడు. కీలకమైన ప్లే ఆఫ్స్‎కు బట్లర్ దూరం కానుండటంతో అతడి ప్రత్యామ్నాయంపై గుజరాత్ టైటాన్స్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బట్లర్ స్థానాన్ని శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్‎తో భర్తీ చేసింది జీటీ. కుశాల్ మెండిస్‎తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు గురువారం (మే 15) అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. 

కాగా, ఐపీఎల్ 18 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటి వరకు మొత్తం 11 మ్యాచులు ఆడి అందులో 8 విజయాలు సాధించి దాదాపు ప్లే ఆఫ్స్‎ బెర్త్ ఖరారు చేసుకుంది. గుజరాత్ విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, జోస్ బట్లర్ పాత్ర కీలక పాత్ర పోషించారు. బట్లర్ 71 సగటు, 163 స్ట్రై్క్ రేట్‎తో 500 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంలో బట్లర్ పాత్ర కూడా ఉంది. అయితే.. ఐపీఎల్ వాయిదా కారణంగా బట్లర్ కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచులకు దూరం కానుండటంతో గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురు దెబ్బనేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు.. బట్లర్ స్థానంలో గుజరాత్ భర్తీ చేసిన మెండిస్ PSLలో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆకట్టుకుంటున్నాడు. మెండిస్ మూడుసార్లు 30+ పరుగులు సాధించాడు. 3/4 స్థానంలో బ్యాటింగ్‎కు దిగి చివర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. 14 బంతుల్లో 35*, 14 బంతుల్లో 28, 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు.  ఈ నేపథ్యంలో మెండిస్‎ను ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్. ఇక, మిగిలన ఐపీఎల్ మ్యాచులు బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ మొత్తం ఆరు వేదికల్లో జరగనున్నాయి. మే 29 క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు.