మల్కాజిగిరి, వెలుగు: కాప్రా సర్కిల్ ఆఫీసు ఎదుట సోమవారం ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ16వ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా మార్చాలని కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంతకుముందు కుషాయిగూడ బస్టాండ్ నుంచి కాప్రా సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ. కుషాయిగూడ సంక్షేమ సంఘం, జమ్మిగడ్డ కాలనీల వాసులు మరో ఆందోళన చేపట్టారు.
డీసీ నియంతలా వ్యవహరిస్తున్నరు
దాదాపు 300 మంది కార్యాలయాన్ని ముట్టడించగా, సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండడంతో డీసీ జగన్తన చాంబర్ లోనే ఉన్నారు. కిందికి వచ్చి వినతి పత్రాలు స్వీకరించాలని ఆందోళనకారులు కోరగా, ఆయన నిరాకరించారు. ఇద్దరు- ముగ్గురు చాంబర్‌కు వచ్చి సమర్పించాలని సూచించారు. దీంతో ఆందోళనకారులు డీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, ఉద్రిక్తత నెలకొంది.
కాప్రా డీసీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి జోక్యం చేసుకొని డీసీని కిందికి పిలిపించారు. అనంతరం ఇరువర్గాల వాదనలు విని, వినతి పత్రాలు స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది.
