ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. కేసీఆర్ సర్కార్పై కేవీ రమణాచారి సంచలన వ్యాఖ్యలు

ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. కేసీఆర్ సర్కార్పై కేవీ రమణాచారి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా వాస్తవమన్నారు. గత ఆరేళ్లుగా తాను బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నానని.. ఆగస్టు నెల జీతాలు ఇప్పటి వరకు బ్రాహ్మణ పరిషత్ ఉద్యోగులకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన అసమర్థత అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయిందంటూ తీవ్రస్థాయిలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఓ హోటల్ లో జరిగిన తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో కేవీ రమణాచారి ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

తమకు గత 3, 4 నెలలుగా పెన్షన్లు రావడం లేదని, కొత్తవారికి కూడా అందడం లేదని తెలంగాణ జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్.. కేవీ రమణాచారికి చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అక్టోబర్ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని.. అంతలోపు ప్రభుత్వానికి మీ డిమాండ్లను తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని రమణాచారి వారికి సూచించారు. అంతకుముందు.. ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు గద్దర్, గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ సాయిచంద్ చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు.

మంత్రి మల్లారెడ్డి సైతం ఇవే వ్యాఖ్యలు..

మంత్రి మల్లారెడ్డి తన సొంత నియోజకవర్గం (మేడ్చల్)లో శనివారం (ఆగస్టు 12న) పర్యటించారు. శామీర్ పేట మండలం అలియాబాద్ లో సమస్యల పరిష్కారం కోసం స్థానికులు మంత్రిని నిలదీశారు. కొన్నేండ్లుగా తమ గ్రామంలో మురుగునీటి సమస్య ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని నిలదీశారు. కరోనా తర్వాత పరిస్థితులు బాగా లేవని.. సొంత డబ్బులు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నానని మల్లారెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దీంతో స్థానికులు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.