RTCని తేల్చాల్సింది లేబర్​ కోర్టే

RTCని తేల్చాల్సింది లేబర్​ కోర్టే

వివాదం ఆర్టీసీ కార్పొరేషన్‌‌ లేదా 48 వేల మంది ఉద్యోగులకే పరిమితమైనది కాదు. అది 48 వేల కుటుంబాలకు చెందినదిగా పరిగణించి పట్టువిడుపు ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉండాలి. కార్మికులను డ్యూటీలో చేర్చుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి. ఒక్కసారిగా అన్ని వేల కుటుంబాలు రోడ్డునపడితే ఎంత దయనీయంగా పరిస్థితులు ఉంటాయో కూడా ఆలోచించాలి.                                     – హైకోర్టు

ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్​ అని లేబర్​ డిపార్ట్​మెంట్​ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు
రెండు వారాల్లోగా లేబర్​ కోర్టుకు కమిషనర్ రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
మేం కమిటీ వేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ లేదు
ప్రజల కోసం ప్రయత్నించాం.. అయినా ఫలితం లేదు
అందుకే విచారణను ముగిస్తున్నాం: హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి
సునీల్​ శర్మ కౌంటర్​ చూస్తే.. ఐఏఎస్​లకు శిక్షణలోనే లోపం ఉన్నట్లుంది
ప్రైవేటు రూట్ల పర్మిట్లు, ఆత్మహత్యలపై నేడు విచారణ

హైదరాబాద్‌‌, వెలుగుఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్‌‌ 5న లేబర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, ఆ విషయాన్ని వెల్లడించే అధికారం ఆయనకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇండస్ట్రియల్‌‌ డిస్ప్యూట్‌‌ యాక్ట్‌‌ 12 ప్రకారం ఆ అధికారం లేబర్‌‌ కమిషనర్‌‌కే ఉందని, ఆయన ఇచ్చే నివేదికను బట్టి తేల్చాల్సింది లేబర్​ కోర్టేనని స్పష్టం చేసింది. ‘‘సమ్మె లీగలో ఇల్లీగలో చెప్పాల్సింది లేబర్​ కమిషనరే. ఆ విషయాన్ని ఆయన లేబర్​ కోర్టుకే  రిపోర్టు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆయన రిపోర్టు చేయలేదు. ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించింది. సమ్మెపై రెండువారాల్లోగా లేబర్‌‌ కోర్టుకు ఏ విషయమూ రిపోర్టు చేయాలని లేబర్​ కమిషనర్​ను ఆదేశించింది. ఒకవేళ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని భావించినా.. అందుకు గల కారణాలను కూడా లిఖితపూర్వకంగా లేబర్​ కోర్టుకు చెప్పాలని, ఇదే విషయాన్ని ఈ కేసులోని పిటిషనర్‌‌కు, ఇతర ప్రతివాదులకు చెప్పాలని ఉత్తర్వులు ఇచ్చింది.

సమ్మె, కార్మిక సంఘాల డిమాండ్ల విషయంలో లేబర్‌‌‌‌ కోర్టు తగిన ఉత్తర్వులు ఇస్తుందని స్పష్టం చేసింది. కార్మికులను డ్యూటీలో చేర్చుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని, సూచన మాత్రం చేయగలమని తెలిపింది. ఆర్టీసీ సమ్మె కేసులో ప్రజాహితం దృష్ట్యా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, తమకున్న విశేషాధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జీలతో కమిటీ వేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుదన్న ఆశ ఏమాత్రం లేదని, అందుకే విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అని వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిల్‌‌‌‌పై సోమవారం హైకోర్టులో పిటిషనర్, ప్రతివాదుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో చీఫ్​ జస్టిస్​ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ రెడ్డితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌  ఉత్తర్వులు వెలువరించి పిల్‌‌‌‌పై విచారణను ముగించింది.

ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి

డ్యూటీలో చేరేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని, కానీ వాళ్లను డ్యూటీలో చేర్చుకునే పరిస్థితులు లేవంటూ ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ బెదిరింపు ధోరణిలో అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేశారని, డ్యూటీల్లో చేరబోయే వాళ్లకు అవాంతరాలు లేకుండా చూసేలా  ఆదేశాలివ్వాలని యూనియన్‌‌‌‌ కోరింది. దీనికి స్పందించిన డివిజన్​ బెంచ్​.. డ్యూటీలో చేర్చుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని, విజ్ఞాపన మాత్రం చేయగలమని తేల్చిచెప్పింది. వివాదం ఆర్టీసీ కార్పొరేషన్‌‌‌‌ లేదా 48 వేల మంది ఉద్యోగులకే పరిమితమైనది కాదని, అది 48 వేల కుటుంబాలకు చెందినదిగా పరిగణించి పట్టువిడుపు ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉండాలని సూచించింది. కార్మికులను డ్యూటీలో చేర్చుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని, ఒక్కసారిగా అన్ని వేల కుటుంబాలు రోడ్డునపడితే ఎంత దయనీయంగా పరిస్థితులు ఉంటాయో కూడా ఆలోచన చేయాలని హితవుపలికింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వయసు మళ్లిన వాళ్లంతా ఇతర ఏ పనులు చేయలేరనే దృక్పథంలో ఉండాలని పేర్కొంది. డ్యూటీల్లో చేరేందుకు ఇదే ఆఖరు తేదీ అంటూ ఒకసారి.. ఇప్పుడు డ్యూటీల్లో చేరేందుకు సిద్ధపడ్డా చేర్చుకునేందుకు అవకాశాలు లేవని ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ సునీల్‌‌‌‌ శర్మ సాక్షాత్తు హైకోర్టులో కౌంటర్‌‌‌‌ వేసి రాజకీయ నేతను తలపించారని యూనియన్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌ డి.ప్రకాశ్​రెడ్డి వాదించారు. అధికార పార్టీ నాయకుడి తరహాలో అఫిడవిట్‌‌‌‌ వేయడాన్ని కోర్టు తీవ్రంగా తీసుకుని కోర్టు రికార్డుల్లోకి ఎక్కించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులపై 97 లక్షల మంది ప్రయాణికులు ఆధారపడ్డారు.

అంత భారీ సంఖ్యలోని ప్రజలు కష్టాలు పడకుండా ఉండాలంటే సమ్మె విరమించాలని యూనియన్‌‌‌‌కు సలహా ఇచ్చాం. యూనియన్‌‌‌‌ కూడా ప్రజాప్రయోజనం దృష్ట్యా సమ్మె విరమించేందుకు సుముఖతతో ఉంది. అయితే డ్యూటీల్లో చేరేందుకు వెళితే తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి” అని ప్రకాశ్​రెడ్డి వాదించారు.  1963లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌‌‌‌ మేరకు సమ్మెలో పాల్గొన్న వారందరినీ విధుల నుంచి తప్పించేందుకు వీల్లేదని, సమ్మె లీగల్‌‌‌‌ అయినా ఇల్లీగల్‌‌‌‌ అయినా ఉద్యోగంలో ఉండే హక్కు ఉంటుందని ఆ రూలింగ్​ చెబుతోందని ప్రకాశ్​రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీ విభజన 2016లో జరిగితే అంతకు ముందే ఎస్మా జీవో ఇచ్చినట్లుగా టీఎస్‌‌‌‌ ఆర్టీసీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ వాదనలపై డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌.. హైకోర్టుకు అనూహ్య అధికారాలు ఉన్నాయని, దాన్ని ఉపయోగించి కమిటీ వేయవచ్చని, వేస్తే రేపు కూడా ఆర్టీసీ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ లేదని, అది ఎంతగా అంటే ఇసుక రేణువులో సగం మందమైనా లేదని పేర్కొంది. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరులోనే రేపు కమిటీ దగ్గర కూడా వ్యవహరిస్తే చివరికి కాలయాపన జరుగుతుందని, అందుకే ఆ విశేషాధికారాలను వినియోగించలేకపోతున్నామని తేల్చిచెప్పింది.

కౌంటర్​ చూస్తే..ఆయన శిక్షణలోనే లోపం ఉన్నట్లుంది

ఐఏఎస్‌‌‌‌ అధికారి వేసిన కౌంటర్‌‌‌‌ చూస్తే ఐఏఎస్‌‌‌‌లకు శిక్షణ ఇవ్వడంలోనే లోపాలున్నట్లుగా ఉందని డివిజన్​ బెంచ్​ వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో ఒక్కో అధికారి ఒక్కో తీరుగా చెప్పారని, చెప్పిన దాన్ని వాళ్లే కాదన్నారని, ఎక్కడ నిజం ఉందో దేవుడికే తెలియాలని పేర్కొంది. ‘‘అంతా ప్రజల కోణంలోనే చూస్తున్నాం. ఇప్పటికే చాలారోజులు గడిచాయి. ఇక వెంటనే దీనిని పరిష్కరించాలి. అందుకే లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌కు ఉత్తర్వులు ఇస్తున్నాం” అని తెలిపింది.

‘సిండికేట్​ బ్యాంక్’​ రూలింగ్ ​దీనికి వర్తించదు

ఒకే అఫిడవిట్‌‌‌‌ ద్వారా సమగ్ర సమాచారం డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ముందు ఉంచామని, కన్సిలేషన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అని ప్రకటించారని, ఇండస్ట్రియల్‌‌‌‌ డిస్‌‌‌‌ప్యూట్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 22 ప్రకారం అదే అధికారికమని అడిషినల్‌‌‌‌ ఏజీ రామచందర్‌‌‌‌రావు హైకోర్టులో వాదించారు. సిండికేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇదే చెబుతోందని అన్నారు. సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అయినప్పుడు సమ్మెలోకి వెళ్లిన వాళ్లకు ఒక నెల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించేందుకు వీలుందని పేర్కొన్నారు. అయితే.. సిండికేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ కేసు రూలింగ్‌‌‌‌ ఆర్టీసీ సమ్మె కేసుకు అమలు కాదని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ తేల్చిచెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ రూలింగ్​లో ఎక్కడా చెప్పలేదని గుర్తుచేసింది.

ఇల్లీగల్​ అని లేబర్​ కోర్టుకు ఎందుకు చెప్పలే

సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అంటున్న విషయాన్ని లేబర్‌‌‌‌ కోర్టుకు ఎందుకు చెప్పలేదని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు కేసు కారణంగా చెప్పలేదన్న రాష్ట్ర సర్కార్‌‌‌‌ వాదనను తోసిపుచ్చింది. స్టే వంటి ఆర్డర్స్‌‌‌‌ లేనప్పుడు లేబర్‌‌‌‌ కోర్టుకు చెప్పే స్వేచ్ఛ, అధికారం అధికారికి ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర సర్కార్‌‌‌‌ తరఫున ఏజీ ప్రసాద్​ వాదిస్తూ.. లేబర్‌‌‌‌ కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ప్రభుత్వ తగిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. వాదనల తర్వాత పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు పిల్‌‌‌‌పై విచారణకు తెర దించింది.

‘‘సమ్మె చేసిన ఉద్యోగుల్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డ్యూటీలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇండస్ట్రియల్‌‌‌‌ డిస్‌‌‌‌ప్యూట్‌‌‌‌యాక్ట్‌‌‌‌ (ఐడీ యాక్ట్‌‌‌‌) 12(4) ప్రకారం చర్చల ఫెల్యూర్‌‌‌‌ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ రిపోర్టును సెక్షన్‌‌‌‌ 12(5) ప్రకారం లేబర్‌‌‌‌ కోర్టుకు ఇవ్వాలో లేదో అనేది లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ తేల్చాలి. సమ్మె చట్ట విరుద్ధమా కాదా అని తేల్చే అధికారం హైకోర్టుకు లేదు. ఇదే సమయంలో సమ్మె చేసే వాళ్లతో చర్చలు జరపాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయలేవు. సమ్మె చట్ట విరుద్ధమా? కదా? అన్న విషయాన్ని తేల్చే అధికారం లేబర్‌‌‌‌ కోర్టుకే ఉంది. సమ్మెకు దిగడం అంటే ఉద్యోగులు తమ ఉద్యోగాలను విడిచివెళ్లినట్లు కాదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ఈ కేసులో సమ్మెలోకి దిగిన వాళ్లను తొలగిస్తే 48 వేల మంది ఆర్టీసీ సిబ్బంది మాత్రమే కాక, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోడ్డునపడతారు. ఉపాధి లేక తిరిగి ఉద్యోగాలు రాక జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. తండ్రి లాంటి పాలకుడు ఉద్యోగుల పట్ల ఔదార్యంతో ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించేగుణంతో వ్యవహరించాలి’’                       – హైకోర్టు

రెండు పిల్స్‌‌‌‌పై నేడు విచారణ

5,100 ప్రైవేటు బస్సుల పర్మిట్​ను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిటిషన్​పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. మంగళవారం వరకు ప్రైవేటు పర్మిట్లపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.