
- టీ గేట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన కార్మిక శాఖ
- ప్రతి ఐటీఐలో ప్లేస్‌మెంట్స్‌పై అధికారులతో కమిటీ
- కళాశాలలకు సమీపంలో ఉన్న కంపెనీలతో చర్చలు
- డిమాండ్‌కు తగ్గట్టుగా స్కిల్స్, కోర్సులు
- 2 లక్షలకు అడ్మిషన్లను పెంచే ప్లాన్
- ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చేలా ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు: ఐటీఐ ( ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ )లో ట్రైనింగ్ పూర్తి కాగానే స్టూడెంట్స్ వివిధ కంపెనీల్లో జాబ్ పొందేలా కార్మిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం టీ గేట్ ( గేట్ వే ఫర్ అడాప్టింగ్ ట్రైనింగ్ ఎంప్లాయిమెంట్) అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ, 235 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రస్తుతం ఏటా 85 వేల అడ్మిషన్లు అవుతున్నాయి. ఇందులో ఏటా ట్రైనింగ్ పూర్తి చేసుకుంటున్న వారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సాధిస్తున్నారు. అయితే, అడ్మిషన్ల సంఖ్యను 2 లక్షలకు పెంచి.. వీరిలో 70 శాతం మంది ట్రైనింగ్ పూర్తి కాగానే జాబ్ లు పొందేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకు ప్రతి ఐటీఐలో కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ అధికారులు, కాలేజీ ప్రిన్సిపాల్స్ తో కమిటీలు ఏర్పాటు చేశారు. ఐటీఐకి 50 కిలో మీటర్ల దూరంలోని కంపెనీలకు ఈ కమిటీ వెళ్లి అక్కడి ఉద్యోగం సాధించాలంటే కావాల్సిన స్కిల్స్, జాబ్‌లకు అర్హత, ఆ కంపెనీకి ఉన్న అవసరాలపై అధ్యయనం చేయనున్నది. అలాగే, కంపెనీలతో టైఅప్ కానున్నారు. ఆ కంపెనీలకు కావాల్సిన కోర్సులను ఐటీఐలో స్టార్ట్ చేసేలా ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్సు చేయనున్నది. కాగా, రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
స్కిల్స్, కోర్సులను పెంచే యోచన
ఐటీఐల్లో ఏర్పాటు అయిన కమిటీలు నిరుద్యోగులకు, కంపెనీల అవసరాలకు మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయనున్నాయి. ఈ కమిటీలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ కమిషనర్, ఐటీఐ ప్రిన్సిపాల్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌సహా మొత్తం 5 లేదా 6 మంది ఉన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా కార్మిక శాఖ కమిషనర్, ఫ్యాక్టరీస్ నుంచి, ఐటీఐల నుంచి జేడీ అధికారితో కమిటీ ఏర్పాటయింది. ఏ స్కిల్స్, కోర్సులు పూర్తి చేసిన వారికి కంపెనీలు, మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉందన్న అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా కంపెనీల ప్రముఖులతో సమావేశం కానున్నారు. జాబ్ అవకాశాలు ఉన్న కోర్సులను, స్కిల్స్‌ను పెంచేందుకు ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్‌లో 60 శాతం, వెల్డింగ్‌లో 20, ప్లంబింగ్‌లో 30, మెకానికల్ నుంచి 45, ఎలక్ట్రికల్ 45, ఐటీ 50, అటోమొబైల్ ఫీల్డ్‌లో 55 శాతం మంది జాబ్ లు సాధిస్తున్నారని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. టీ గేట్ పై ఇటీవల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, అడిషనల్ కమిషనర్ గంగాధర్, జాయింట్ డైరెక్టర్ నగేశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీ గేట్ కు సంబంధించి ఒక లోగోను అధికారులు రెడీ చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ లోగోను లాంచ్ చేయనున్నారు.
జాబ్ కల్పించడమే లక్ష్యం
ఐటీఐలో అడ్మిషన్లు పెంచడానికి, ట్రైనింగ్ తీసుకున్న వారికి జాబ్ కల్పించడమే లక్ష్యంగా టీ గేట్ ను తీసుకొచ్చాం. అన్ని ఐటీఐల్లో కమిటీల ఏర్పాటు పూర్తయింది. సమీపంలో ఉన్న కంపెనీలకు ఈ కమిటీ వెళ్లి స్కిల్స్, జాబ్ అవసరాలు వంటి వాటిపై అధ్యయనం చేయనున్నది. అడ్మిషన్లు 85 వేల నుంచి 2 లక్షల వరకు పెంచడంతోపాటు వీరిలో 60 నుంచి 70 శాతం మంది ఉద్యోగాలు పొందేలా టీ గేట్ ను అమలు చేయనున్నాం. ఐటీఐ స్టూడెంట్స్‌కు, కంపెనీలకు మధ్య ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేస్తాం. దీనిపై ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాం. ఆయన ఈ ఇనీషియేటివ్‌ను అభినందించారు. వచ్చే నెలలో లోగో లాంచ్ చేస్తున్నాం.
- గంగాధర్, అడిషనల్ కమిషనర్